Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : డబ్ల్యూపీఎల్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో స్ఫూర్తిదాయక విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు ఓపెనర్ సోఫీ డివైన్ సంచలన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసింది. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అలరించిన సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లోనే 99 పరుగులు చేయడం విశేషం. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసిన సోఫీ సెంచరీకి ఒక పరుగు దూరంలో అవుటైంది. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవైపు సోఫీ విధ్వంసం కొనసాగుతుండగా, మరో ఎండ్ లో కెప్టెన్ స్మృతి మంధన (37) తన వంతు సహకారం అందించింది. వీరిద్దరూ అవుటైనా, ఎలిస్ పెర్రీ (19 నాటౌట్), హీదర్ నైట్ (22 నాటౌట్) జోడీ ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓడిన ఆర్సీబీ... మార్చి 15న యూపీ వారియర్స్ తో జరిగిన పోరులో గెలిచి గెలుపు బోణీ కొట్టింది. ఇప్పుడు గుజరాత్ జెయింట్స్ పైనా నెగ్గి టోర్నీలో రెండో విజయం నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.