Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అత్తరాంటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. మెట్టినిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలెట్టింది. చివరకు పుట్టింటికి తిరుగు ప్రయాణమైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి రాజస్థాన్‌కు చెందిన యువకుడితో ఇటీవలే వివాహం జరిగింది. అప్పగింతలు పూర్తయ్యాక వధువు మెట్టినింటికి కారులో బయలుదేరింది. అయితే..మార్గమధ్యంలో యువతి అకస్మాత్తుగా తన మనసు మార్చుకుంది. 'అత్తారిల్లు దూరంగా ఉంది..నేను పుట్టింటి వెళ్లిపోతా' అంటూ పెద్ద పెట్టున ఏడుపు లంఘించుకుంది. కారు ఆపాలంటూ పట్టుపట్టింది. కారు ఆగంగానే కారు దిగిపోయింది. నడివీధిలో పెళ్లిదుస్తుల్లో ఓ యువతి పెద్ద పెట్టున ఏడవడంతో హైవేపై కలకలం రేగింది. అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు వాహనదారులు తమ కార్లు రోడ్డు మీదే నిలిపేయడంతో హైవేపై వాహనాల బారులుతీరాయి. ఇదంతా చూసి పెళ్లికొడుక్కి దిమ్మతిరిగినంత పనైంది. ఈ విషయం మహరాజ్‌పూర్ పోలీసులకు తెలియడం వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి తరపు వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పుట్టింటికి తిరిగి వెళ్లిపోతానని వధువు తేల్చి చెప్పడంతో మహిళ పోలీసుల సాయంతో ఆమెను జాగ్రత్తగా పంపించారు.