Authorization
Thu May 01, 2025 11:37:21 am
నవతెలంగాణ - ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై గురువారం పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి ఈరోజు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కాగా తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.