Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం 11.30 గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు "సే నోటు డ్రగ్స్" నినాదంతో భగత్ సింగ్ స్ఫూర్తి తో భగత్ సింగ్ సందేశ ర్యాలీ నిర్వహించారు. యువతలో దేశభక్తి, ఐక్యత, సామాజిక స్పృహ పెంచేలా ఉత్తేజకరంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న యువతీ, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ "Say No to DRUGS" అని నినదించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించిన సినీ నటులు డాక్టర్ మాదాల రవి మాట్లాడుతూ యువత దేశానికి మూలాధారమని, యువతలో భగత్ సింగ్ లాగా దేశం గురించి సమాజం గురించి ఆలోచించేలా చైతన్య రగిలించాల్సిన కర్తవ్యం మనందరి పైన ఉందని అన్నారు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలు విదేశాలలో ఉద్యోగాలు చేయాలని, అత్యధిక సంపాదనాపరులు కావాలని ఆకాంక్షిస్తున్నారని, పక్కింటి పిల్లలు దేశం గురించి ఆలోచిస్తే సంతోషిస్తారని ఈ వైఖరి మారాలని, ప్రతి పేరెంటు తమ పిల్లల్ని భగత్ సింగ్ లాగా తీర్చిదిద్దాలని అన్నారు.
ప్రదర్శన ముగింపు సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు కే. పార్థసారథి మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారని ఈరోజు యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తుందని భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ మాదక ద్రవ్యాల నుండి యువతను రక్షించేలా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని, అందుకు ఈ ప్రదర్శన నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు డివైఎఫ్ ఐ నగర కార్యదర్శి ఎండి. జావిద్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, మల్కాజిగిరి - మేడ్చల్ జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి కిరణ్, డివైఎఫ్ఐ మాజీ నగర కార్యదర్శి జే. కే శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ ప్రదర్శనకు మహేందర్, లెనిన్ గువేరా, విజయ్ కుమార్, రవి, శ్రీనివాస్, అజయ్ బాబు నాయకత్వం వహించారు. గత నెల రోజుల నుండి డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భగత్ సింగ్ యువజనోత్సవాలలో భాగంగా ఈ రోజు ఈ ప్రదర్శన నిర్వహించారు.