Authorization
Tue April 29, 2025 02:45:39 pm
నవతెలంగాణ - చెన్నై
తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కోయంబత్తూరులోని కోర్టు ఆవరణలో జరిగింది. కోయంబత్తూరులో ఉన్న కోర్టుకు ఓ వివాదం పరిష్కారం కోసం చిత్ర, శివకుమార్ అనే ఇద్దరు భార్యాభర్తలు గురువారం వచ్చారు. భర్త శివకుమార్ వేధింపులు తట్టుకోలేక చిత్ర భర్తపై కేసు పెట్టింది.
ఈ కేసు విచారణ నిమిత్తం వారు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో భార్య పక్కనే కూర్చున్న భర్త తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో చిత్ర ముఖంపై దాడి చేశాడు. ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో భార్య చిత్రతో పాటు పక్కన ఉన్న ఐదుగురిపై ఆ యాసిడ్ పడడంతో వారికి కూడా గాయాలయ్యాయి. యాసిడ్ కారణంగా కోర్టు ఆవరణలోని టేబుల్ కాలిపోయింది. వెంటనే క్షతగాత్రులందరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం శివకుమార్ తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న న్యాయవాదులు, స్థానికులు శివకుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.