Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మెగా కోడలు ఉపాసన ఓ విశిష్ట ఘనతను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉపాసన అందిస్తున్న సేవలు, రాణిస్తున్న తీరుకు గుర్తింపుగా ఆమె పేరును జాబితాలో చేర్చినట్టు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.
దీనిపై ఉపాసన స్పందించారు. ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ లో ఒకరిగా తనను గుర్తించినందుకు ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను పెళ్లాడక ముందు నుంచే ఉపాసన అపోలో ఆసుపత్రుల అనుబంధ విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా సామాజిక సేవల రంగంలో విజయవంతంగా పురోగమిస్తున్నారు. బీ పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ ను కూడా నడిపిస్తున్నారు. దాంతో పాటు ఓ గృహిణిగానూ సమర్థంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.