Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 57,736 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 16,996 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు కుంగి 82.24 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు ఆరంభంలో లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మదుపర్లు నిన్న రూ.1,531 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేయడం గమనార్హం. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.156 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. దీంతో వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ నేడే ముగియనుంది. మరోవైపు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై కూడా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.