Authorization
Tue April 29, 2025 10:10:53 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,151 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2,208 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కు ఎగబాకింది. మరోవైపు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య4,47,09,676కి చేరింది. ఇప్పటి వరకు 4,41,66,925 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,848గా నమోదైంది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.78 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 (220,65,76,697) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.