Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కదులుతున్న కారులోనే డ్రైవర్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు రాగా, అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ పోలీసు అధికారి అప్రమత్తమై వెంటనే సీపీఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. బాధితుడు స్పందించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. మలక్‌పేట్ ధోబీగల్లీకి చెందిన కావలి శ్రీనివాస్(40) భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్‌లో కొన్నాళ్లుగా అద్దెకుంటున్నాడు. క్యాబ్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో క్యాబ్‌లో ఓ కుటుంబాన్ని యాదగిరిగుట్టకు తీసుకెళ్తున్నాడు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటి కాస్త ముందుకెళ్లగానే శ్రీనివాస్‌కు గుండెనొప్పి రావడంతో గేర్ రాడ్ వైపు కుప్పకూలిపోయాడు. వెనుక సీటులో ఉన్న ప్రయాణికురాలు అప్రమత్తమె(వెనుక సీట్)లోంచి స్టీరింగ్ నియంత్రించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న రామన్నపేట సీఐ మోతీరామ్ ముందున్న కారు నెమ్మదిగా వెళ్లడం గమనించి.. ఏం జరిగిందో చూశారు. వెంటనే కిందకు దూకి, మరో వ్యక్తి సాయంతో ఆ కారును నియంత్రించారు. డ్రైవర్ శ్రీనివాస్‌ను బయటకు తీసి సీపీఆర్ చేయగా స్పృహలోకి రావడంతో వెంటనే తన వాహనంలోనే హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుణ్ని పరిశీలించిన వైద్యులు ఆయన మృతిచెందినట్లు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.