Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కౌలాలంపూర్: విషపూరితమైన ఒక చేప కూర తిన్న తర్వాత ఒక మహిళ మరణించింది. ఆమె భర్త కోమాలో ఉన్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కుమార్తె వాపోయింది. మలేషియాలోని జోహార్లో ఈ సంఘటన జరిగింది. మార్చి 25న ఒక వృద్ధుడు స్థానిక చేపల మార్కెట్లోని షాపు నుంచి విషపూరితమైన పఫర్ చేపను కొని ఇంటికి తెచ్చాడు. దానిని కూరగా వండి తిన్న తర్వాత 83 ఏళ్ల భార్యతోపాటు ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ వణికిపోవడంతోపాటు శ్వాస అందక ఇబ్బందిపడ్డారు. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్ సీవ్ గ్వాన్ మరణించింది. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే వృద్ధాప్యం వల్ల ఆయన కోలుకుని ఆరోగ్యంతో బయటపడటం కష్టమని వైద్యులు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై స్థానిక ఆరోగ్య అధికారులు స్పందించారు. పఫర్ చేప కూర తినడంతో విషాహారం వల్ల వృద్ధురాలు మరణించినట్లు తెలిపారు. ఆ రోజు అమ్మిన చేపల వివరాలు సేకరించినట్లు చెప్పారు. ఇలాంటి సంఘటన మరెక్కడా జరుగలేదన్నారు. ఇలాంటి విషపూరిత చేపలను తినడంపై జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని ఆమె వాపోయింది.
మరోవైపు జపాన్ ప్రజలు లొట్టలేసుకుని తినే పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. అయితే ఈ విష పదార్థాలను ఎలా తొలగించాలో అన్న దానిపై శిక్షణ పొందిన అత్యంత అర్హులైన చెఫ్‌లకు మాత్రమే పఫర్ చేపలు వండి సర్వ్ చేసేందుకు అనుమతి ఉంటుందని వెల్లడించింది.