Authorization
Wed April 30, 2025 10:06:35 am
నవతెలంగాణ - వికారాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ బెడద వీడటం లేదు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ ఇష్యూ ముగియక ముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం రేపుతోంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్ష మొదలైన అరగంటలోపే అంటే 9:37 గంటలకే ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. తాండూరులో పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. తాండూర్లోని ఓ సెంటర్లో ప్రశ్నాపత్రం లీకైనట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజ్‌తో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశ్నాపత్రం లీకేజ్‌పై వికారాబాద్ డీఈవో వివరణ ఇచ్చారు. తమ జిల్లాలో ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ అవలేదని చెబుతున్నారు. మరి ప్రశ్నాపత్నం లేకేజ్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.