Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాయి లౌకిక్, సుష్మితను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలోని నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. సుష్మిత కోసం రూ.6 లక్షలు పెట్టి.. ప్రవీణ్ నుంచి డీఏఓ పరీక్ష పేపర్‌ను సాయి లౌకిక్ కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 17కు అరెస్ట్‌ల సంఖ్య చేరింది. మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ మెరిట్ లిస్టును సేకరించిన సిట్.. 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని విడతల వారీగా విచారించి, వారి స్టేట్మెంట్ను నమోదు చేసుకుంది. వారి సామర్థ్యం, ప్రతిభాపాటవాలను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలను వారి ముందు పెట్టి, ఎంత సమయంలో సమాధానాలు రాస్తారు? అనే విషయాన్ని గుర్తించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితులైన ప్రవీణ్, షమీమ్, రమేశ్, సురేశ్‌లతో వీరికి సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేసింది. అటు జగిత్యాల జిల్లా మల్యాలలో మెయిన్స్‌కు అర్హత సాధించిన 40 మంది అభ్యర్థులను విచారించిన సిట్.. ఓ నివేదికను సిద్ధం చేసింది. ఈ నెల 11న హైకోర్టుకు ఆ రిపోర్టును సీల్డ్కవర్లో అందజేయనుంది. మరోవైపు ఈ కేసులో 15 మంది అరెస్టయిన వారిలో చివరి ముగ్గురు నిందితులు ప్రశాంత్, తిరుపతయ్య, రాజేంద్రకుమార్‌ల పోలీసు కస్టడీ గురువారంతో ముగియడంతో, వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ముగ్గురూ ఎంత మందికి ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించారు? అనే కోణంపై ఈ మూడ్రోజులూ ప్రశ్నించి, వాంగ్మూలాన్ని సేకరించినట్లు తెలిసింది.