Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: విమానాల్లో తాగుబోతుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో విమానం ఎమర్జెన్సీ డోర్ తీయడానికి ప్రయత్నించాడో ఘనుడు.. అయితే సిబ్బంది గమనించడంతో ప్రమాదం తప్పింది. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రబుద్ధుడిని పోలీసులకు పట్టించిన ఘటన ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం చోటచేసుకున్నది.
శుక్రవారం ఉదయం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ308 విమానం న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్నది. ఉదయం 7.56 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్లాప్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విషయాన్ని ఫ్లైట్ క్యాప్టెన్‌కు తెలియజేశారు. అయితే విమానం గమ్యస్థానం (బెంగళూరు) చేరుకున్న తర్వాత అతడని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.