Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్: కల్తీ కల్లుకు బానిసలైన కొందరు తగినంత మత్తు దొరక్క, తాగుడుకు దూరంగా ఉండి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాలమూరులో వెలుగు చూడగా.. అరుపులు, కేకలతోపాటు పిచ్చి చేష్టలకు పాల్పడుతున్న పది మంది శుక్ర, శనివారాల్లో స్థానిక జనరల్ ఆస్పత్రిని ఆశ్రయించారు. వీరంతా పాలమూరు శివారు ప్రాంతమైన దొడ్డలోనిపల్లి, కోయనగర్, మోతీనగర్‌కు చెందినవారు. ఆయా ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో దొరికే కల్తీ కల్లు తాగే అలవాటున్న వీరంతా రెండ్రోజులుగా తాగుడుకు దూరంగా ఉన్నట్టు సమాచారం. మత్తుకోసం కల్లులో కలిపే ఆల్ఫాజోలం లభించని కారణంగా.. వ్యాపారులు ఇటీవల దానిని కల్లులో తక్కువ మోతాదులో కలుపుతున్నారు. ఆ మత్తుకు బానిసలైన వారిలో కొందరు కల్తీ కల్లును మళ్లీ తీసుకోకపోవడం వల్ల, మత్తు మోతాదు సరిపోక మరికొందరు అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. ఆస్పత్రికి వెళ్లిన పది మందిలో ఆరుగురికి స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యులు చికిత్స చేసి పంపించారు. నలుగురిలో ఆల్కాహాల్ విత్డ్రాల్ సిండ్రోమ్ లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకోగా వాళ్లలో ముగ్గురిని శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఓ మహిళకు చికిత్స కొనసాగుతోంది. కాగా, పది మంది అస్వస్థతకు గురి కావడంతో బోయపల్లి, దొడ్డలోనిపల్లిలోని కల్లు దుకాణాల నుంచి ఎక్సైజ్ పోలీసులు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు.