Authorization
Wed April 30, 2025 10:17:37 am
నవతెలంగాణ - అమరావతి
అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. నేతలిద్దరూ ఆదివారం అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని ప్రకటించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వాహనంలో ఆయన్ను తరలించారు. ఈ సమయంలో వాహనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ రోజు టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి స్థానిక అమరలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు శ్రీధర్‌ను అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని.. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై కొమ్మాలపాటి మండిపడ్డారు.