Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలిసి సాగుతామని, తెలంగాణ గడ్డపై బీజేపీని అడుగు పెట్టనివ్వమని కమ్యూనిస్టులు నినదించారు. అంతే కాకుండా ప్రజా సమస్యలపై విడివిడిగా పోరాటం చేస్తున్న సీపీఐ, సీపీఎం తెలంగాణ వేదికగా ఏకమవుతున్నట్టు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి సహా ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. దీనిలో మొట్టమొదటి సారిగా సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశం నిర్వహించడం దీని ప్రత్యేకత.
ఈ క్రమంలో రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని కాపాడుకోవాలంటే మోడీ సర్కారును గద్దె దించాలన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే భాష, ఒకే పార్టీగా మారాలని మోడీ భావిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సహా తమిళనాడు, కేరళలో గవర్నర్ను ఒక సాధనంగా కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.