Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కరోనా వైరస్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అస్పత్రిల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆసుపత్రుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు రోజుల పాటు మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సోమవారం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, హరియాణాలోని ఎయిమ్స్, పాట్నా ఐజీఐఎమ్ఎస్ ఆసుపత్రి, చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అస్పత్రిల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ మాక్‌డ్రిల్స్ మంగళవారం వరకూ కొనసాగనున్నాయి. ఈ మాక్‌డ్రిల్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు అస్పత్రిల్లో వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్లు, పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉన్న బెడ్లు, వెంటిలేటర్, ఐసీయూ బెడ్ల వివరాలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్లు, మాస్కులు వంటి కీలక అంశాలను ఈ మాక్‌డ్రిల్స్‌లో సేకరించనున్నారు. వాటి వివరాలను వైద్యారోగ్య శాఖకు నివేదిస్తారు.