Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములను మంత్రి అమర్నాథ్ సోమవారం సందర్శించారు. ట్రంపెట్ రహదారి నిర్మాణం జరిగే ప్రదేశాన్ని, ముఖ్యమంత్రి నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో, అంతకుముందు సన్రే రీసార్ట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ ప్రక్రియను తెలుసుకున్నారు. శంకుస్థాపన, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తోందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమయ్యిందని అన్నారు. శంకుస్థాపన జరిపేందుకు అవసరమైన అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేశామని చెప్పారు.