Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్తర ఆఫ్రికాలోని మధ్యధరా సముద్ర మార్గంలో 400 మంది వలసదారులతో కూడిన ఒక ఓడ చిక్కుకుపోయింది. వీరు లిబియా నుంచి మధ్యదరా సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దేశం దాటుతుండగా గ్రీస్, మాల్టా మధ్యలో ఈ ఓడ ఆగిపోయినట్టు సమాచారం. దీనిని గమనించిన ఆ ఓడ కెప్టెన్ ఎవ్వరికీ తెలియకుండా అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ ఓడలో ఉన్న 400 మంది వలసదారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.
ఈ తరుణంలో తమ దుర్భర స్థితి గురించి ‘అలారం ఫోన్’ అనే సపోర్ట్ సర్వీస్‌కు సంప్రదించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఈ ఓడ గురించిన వివరాలను ట్విటర్ ద్వారా వెల్లడించింది. తాము ఆల్రెడీ అధికారులకు సమాచారం అందించామని కూడా ఆ సంస్థ పేర్కొంది. ఓడ కింది భాగమంతా నీటితో నిండిపోవడం వల్ల.. అందులోని వలసదారులంతా బోటు పై భాగానికి చేరుకున్నారని తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం ఓ ఓడ గాలికి కొట్టుకుపోతోందని తెలియజేసింది.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న ‘సీ వాచ్ ఇంటర్నేషనల్’ అనే జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ.. ఆ ఓడ సమీపంలోనే మరో రెండు నౌకలున్నట్టు వెల్లడించింది. అయితే ఆ ఓడను రక్షించవద్దని, ఇంధనం మాత్రమే సరఫరా చేయాలని మాల్టా అధికారులు ఆదేశించినట్లు ఆ ఎన్జీవో తెలిపింది. దీనిపై యూరోపియన్ యూనియన్ వెంటనే చర్యలు తీసుకోవాలని, వలసదారుల్ని కాపాడాలని కోరింది. మరోవైపు.. అలారం ఫోన్ సర్వీస్ ట్విటర్లో మరో పోస్ట్ పెట్టింది. ఆ ఓడలో ఉన్న వారందరూ తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారని, వారిని వెంటనే రక్షించాలని తాము కోరామని వెల్లడించింది. తాము డిసియోట్టి అనే ఒక ఓడను పంపించామని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ పేర్కొందని ఇది త్వరగా ఆ ప్రాంతానికి చేరుకొని, అందులో ఉన్న వలసదారుల్ని రక్షిస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది.