Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. మార్కెట్ వద్ద నిలిపిఉంచిన పోలీస్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగినట్లు సమాచారం. కాందహరి బజార్లో పార్క్ చేసిన యాక్టింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారి వాహనాన్ని టార్గెట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి షఫ్కత్ చీమా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఆ అధికారి వాహనం వెనుక పార్క్ చేసిన మోటార్ బైక్‌లో పేలుడు పదార్థం అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ సంఘటనలో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు వెల్లడించారు.
మరోవైపు సివిల్ ఆసుపత్రికి నాలుగు మృతదేహాలను తరలించారని, గాయపడిన ఎనిమిది మందిని అడ్మిట్ చేశారని క్వెట్టా ఆసుపత్రి ప్రతినిధి వాసిమ్ బేగ్ తెలిపారు. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదని పోలీసు అధికారి తెలిపారు. కాగా, దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రెండు రోజులకు ఈ పేలుడు సంభవించింది.