Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్విల్లేలోని ఓ బ్యాంకు వద్ద సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటల సమయంలో ఓల్డ్ నేషనల్ బ్యాంక్ మొదటి అంతస్థులోని సమావేశ మందిరంలో కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని మట్టుబెట్టారు. అయితే, కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో కాల్పుల ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే కనీసం 15 ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతమవుతున్నది. లూయీస్విల్లే ఘటనతో సహా ఏడాది ఇప్పటి వరకు కనీసం 146 కాల్పులు చోటు చేసుకున్నాయి. తుపాకీ పేలుడు ఘటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ప్రజలు ప్రతిరోజూ ఉదయం భయానక స్థితిలో మేల్కొంటున్నారని బ్రాడీ సెంటర్ ప్రెసిడెంట్ క్రిస్ బ్రౌన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకైనా, పాఠశాలైనా, సూపర్ మార్కెట్, చర్చ్ ఏదైనా అమెరికన్లు తమ కమ్యూనిటీల్లో సురక్షితంగా లేరని, తుపాకీ తూటాలకు బలవుతామని భయంతో జీవిస్తున్నారన్నారు.