Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. కుల దురహంకార హత్యకు కొడుకు, అత్త బలయ్యారు. దండపాణి అనే వ్యక్తి కుటుంబం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో నివాసం ఉంటోంది. అతని కొడుకు సుభాష్ ఓ తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం వారిద్దరు పెండ్లి చేసుకున్నారు. ఈ పెండ్లి దండపాణికి ససేమిరా ఇష్టం లేదు. దీంతో కొడుకు, కోడలిపై కోపం పెంచుకున్నాడు. వారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారితో మాట్లాడాలని వచ్చి కొడుకు, కోడలిని కత్తితో నరికాడు. కొడుకు సుభాష్ తీవ్రగాయాలపై అక్కడికక్కడే మరణించాడు. కోడలిపై కత్తితో దాడి చేస్తుండగా.. ఇంట్లోనే ఉన్న నిందితుడి అత్త కన్నమ్మల్ అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను కూడా కత్తితో నరికి హత్య చేశాడు. ఇంతలోనే తీవ్ర గాయాల పాలైన కోడలు అనుష్క అక్కడి నుంచి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది, పారిపోయిన కోడలిని చంపడానికి వెతుకుతున్న క్రమంలో దండపాణిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.