Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
దిండిగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రభుత్వ వైద్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి ఆయన ఇంట్లో ఉన్న 100 సవర్ల బంగారు నగలతో పాటు రూ.20 లక్షల నగదును దోచుకుని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పళని అన్నానగర్‌కు చెందిన ఉదయకుమార్ (55) అనే వైద్యుడు పళని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రేవతి (50), కుమార్తె ఉన్నారు. ఈమె చెన్నైలోని ఒక కాలేజీలో చదువుకుంటుంది. దీంతో తన కుమార్తెను చూసేందుకు రేవతి కొన్ని రోజుల క్రితం చెన్నైకు వచ్చారు. దీంతో ఉదయకుమార్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు.
ఈ తరుణంలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఉదయకుమార్ ను కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి కత్తితో పొడిచి, ఆయన వద్ద ఉన్న బీరువా తాళాలు తీసుకున్నారు. ఆ తర్వాత బీరువా తెరిచి అందులో ఉన్న 100 సవర్ల బంగారు నగలతో పాటు అందులో ఉన్న రూ.20 లక్షల నగదును కూడా దోచుకుని పారిపోయారు. ఈక్రమంలో ముసుగు దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ఉదయకుమార్ రక్తపు గాయాలతో వీధిలోకి వచ్చి బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చారు. వారిచ్చిన సమాచారంలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు ఆధారాలను సేకరించారు. ఉదయకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసున్నారు పోలీసులు.