Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రిలో వీల్‌ఛైర్, స్ట్రెచర్స్ కొరత లేదని స్పష్టం చేశారు. సిబ్బంది ఉండగా అలా లాక్కెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత నెల 31న రాత్రి పేషంట్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని సూపరింటెండెంట్ వివరించారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడని.. ఆరోజే చికిత్స అందించి వెయిటింగ్ రూమ్‌లో ఉంచారని తెలిపారు.
ఆస్పత్రి సిబ్బంది ఉండగా అలా లాక్కెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పేషెంట్‌ను లాక్కెళ్లేటప్పుడు సిబ్బంది గమనించి వారించారని చెప్పారు. ‘‘10 సెకన్లలోనే వీడియో పూర్తయిపోయిందంటే సిబ్బంది స్పందించినట్లే కదా అక్కడ సిబ్బంది ఉండి మాట్లాడి ఎందుకు వీడియో తీస్తున్నారని అడిగితేనే అక్కడితో వీడియో ఆగిపోయింది. వీడియో తీసిన వ్యక్తిని సిబ్బంది ప్రశ్నిస్తే పారిపోయాడు. ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసినట్లు అనిపిస్తోంది. అందుకే పదిహేను రోజుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు’’ అని ఆమె తెలిపారు. దీనిపై మేం సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం. జరిగిన ఘటనను మేం సమర్థించడం లేదు. ఈ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని సూపరింటెండెంట్ వెల్లడించారు.