Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
మహారాష్ట్రలో నమోదైన ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. విచారణ తరుణంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్ ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్ శాశ్వత మినహాయింపునకు రాహుల్ అర్హుడని తెలిపింది. ఈ క్రమంలోనే జూన్ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.
మహాత్మ గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్కు ముడిపెడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని, ఇది ఆర్ఎస్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ.. 2014లో ఓ సంఘ్ కార్యకర్త భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడికి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది అని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ తేదీల్లో రాహుల్ న్యాయవాది క్రమం తప్పకుండా, సరైన సమయానికి కోర్టు ముందు హాజరు కావాలని, న్యాయస్థానం ఆదేశించినప్పుడు నిందితుడూ రావాలని షరతులు విధించింది.