Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖార్టూమ్: ఆఫ్రికా దేశమైన సుడాన్లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్‌లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్‌లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖార్టూమ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. భారతీయులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటూ ట్వీట్ చేసింది.
కాగా, సుడాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్, పారామిలటరీ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య గత కొంతకాలంగా పోరు జరుగుతున్నది. 2021లో జరిగిన సైనిక తిరుగుబాటుకు ముగింపు పలికి దేశాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావడం, పారామిలిటరీ దళానికి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)ను ప్రణాళికాబద్ధంగా సైన్యంలోకి కలపడంపై చర్చలకు ఆర్మీ చీఫ్ ప్రతిపాదించారు. అయితే ఆర్ఎస్ఎఫ్ చీఫ్ డాగ్లో దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుడాన్ ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య వార్ జరుగుతున్నది. మరోవైపు అధ్యక్షుడి భవనంతోపాటు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్ నివాసాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు పారామిలటరీకి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే రాజధాని ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు కీలక ప్రాంతాలు తమ నియంత్రణలో ఉన్నాయని వెల్లడించింది. కాగా, రాజధానితోపాటు పలు ప్రాంతాల్లోని ఆర్మీ శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ ఫైటర్లు దాడులు చేసినట్లు ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నబిల్ అబ్దల్లా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరువైపులా ఘర్షణలు జరుగుతున్నట్లు చెప్పారు. దేశాన్ని రక్షించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.