Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బిల్కిస్ బానోపై లైంగికదాడి ఘటన కేసులో దోషులు జైలు నుంచి విడుదల కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. దోషుల రెమిషన్‌కు సంబంధించిన దస్త్రాలను అందించేందుకు సిద్ధంగా ఉండాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు గుజరాత్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. రెమిషన్ దస్త్రాలు అందజేయాలంటూ మార్చి 27న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃపరిశీలన పిటిషన్ దాఖలు చేస్తామని కేంద్రంతోపాటు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. దోషులకు రెమిషన్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. అది సామూహిక లైంగికదాడి, హత్యకు సంబంధించిన కేసు అని.. దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలు ఏంటని అందులో ప్రశ్నించారు. దీనిని విచారించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం.. జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో దోషులను ఎలా విడుదల చేస్తారని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విడుదల నిర్ణయం తీసుకునే ముందు నేర తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడింది. గర్భిణిపై సామూహిక లైంగికదాడి జరగడంతోపాటు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల కేసును సెక్షన్ 302తో సరిపోల్చవద్దు. యాపిల్స్‌కు నారింజ పండ్లతో పోలిక లేనట్లుగా నరమేధాన్ని ఒక్క హత్యతో పోల్చవద్దు. దేని ఆధారంగా ప్రభుత్వం ఈ విడుదల నిర్ణయం తీసుకుంది? నేడు బిల్కిస్ బానో, రేపు నేను, మీరు.. మరెవరైనా కావచ్చు. రెమిషన్‌కు సంబంధించిన కారణాలు తెలియజేయకుంటే.. మేం సొంతంగా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 2న చేపడతామని తెలిపింది. ఇదిలాఉంటే, 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో జరిగిన అల్లర్లలో ఈ లైంగికదాడి ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. ఇటీవల వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.