Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాటా దురియన్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులు.. టెర్రరిస్టుల దుశ్చర్యకు బలయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమంలో బాటా దురియన్‌లో ఆర్మీ ట్రక్‌పై టెర్రరిస్టులు గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఎన్ఐఏ అధికారులు మరికాసేట్లో పూంచ్‌కు చేరుకోనున్నారు. కాగా, పూంచ్ ఉగ్రదాడినిక సంబంధించిన వివరాలను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. కాగా, గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరడంతో ట్రక్‌లో ఉన్న ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ సైనికులు వీర మరణం పొందారని, ఈ ఘటనలో గాయపడిన ఒక సైనికుడిని రాజౌరీలోని ఆర్మీ దవాఖానకు తరలించామని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టి నెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేని వాతావరణాన్ని అవకాశంగా మలుచుకున్న ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారని అధికారులు వెల్లడించారు. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు.