Authorization
Tue April 29, 2025 11:16:23 am
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీకే చెందిన జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్మాలిక్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఇటీవల 'ది వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ మోడీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దేశ భద్రత విషయంలో మోడీ అనుసరించిన నిర్లక్ష్య వైఖరి, పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ తీరును విమర్శించారు. సైనికులను రోడ్డు మార్గాన తరలించడం అంత క్షేమం కాదని, వారిని విమానాలలో పంపాలని చేసిన విజ్ఞప్తిని హోం శాఖ తిరస్కరించడం, టెర్రరిస్టు ముఠాలు చేసిన దాడిలో 40 మంది సైనికులు మరణించడాన్ని అయన వివరించారు. ఈ దుర్ఘటనను మోడీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని సత్యపాల్మాలిక్ వివరించారు. అదే ఇంటర్వ్యూలో రిలయన్స్ ప్రాజెక్టు అనుమతి కోసం తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆరోపణలకు చేశారు. దీనికి సంబంధించి ప్రశ్నించడానికే సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసి ఈ నెల 28న హాజరుకావాలని ఆదేశించినట్టు భావిస్తున్నారు.