Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్నారు. తిరువనంతపురం, కొచ్చిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అయితే ప్రధాని కేరళ టూర్ సందర్భంగా ఆయనపై ఆత్మాహుతి బాంబు దాడి జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్‌కు గత వారం ఒక బెదిరింపు లేఖ అందింది. కొచ్చికి చెందిన వ్యక్తి పేరుతో మలయాళంలో రాసి ఉన్న ఆ లెటర్‌ను పోలీసులకు ఆయన అందజేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇంటెలిజెన్స్ ఏడీజీపీ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈ బెదిరింపు లేఖ గురించి మీడియాలో ఆదివారం బయటపడింది.
ఈ తరుణంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ దీని గురించి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీడియాకు లీక్ కావడంపై మండిపడ్డారు. కేరళ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, ఇతర ప్రముఖుల భద్రతా బాధ్యతలు చూసే పోలీస్ అధికారుల పేర్లు, వారి విధుల గురించిన పూర్తి వివరాలు 49 పేజీల రిపోర్ట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ విషయంలో పోలీసులు పెద్ద తప్పు చేశారని, దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ బెదిరింపు లేఖపై కేరళ పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. ఆ లెటర్లోని పేరు, మొబైల్ నంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎన్జే జానీని కేరళ పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ బెదిరింపు లేఖ గురించి తనకు ఏమీ తెలియదని అతడు చెప్పాడు. స్థానిక చర్చికి సంబంధించిన అంశంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో తమకు విభేదాలు ఉన్నట్లు జానీ కుటుంబం తెలిపింది. దీంతో ఈ బెదిరింపు లేఖ వెనుక ఆ వ్యక్తి ప్రమేయం ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.