Authorization
Tue April 29, 2025 10:56:59 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ నుంచి, సీఎం కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదన్నారు. ఈ వ్యవహారంపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై తాజాగా రేవంత్ ప్రమాణం చేశారు. ‘‘అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశాను. దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను ఉపసంహరించుకోవాలి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన దిగజారి మాట్లాడుతున్నారు.
తాను విసిరిన సవాల్ మేరకు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశాను. ఈటల తన ఆరోపణలను నిరూపించుకోవాలి’’ అని రేవంత్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ వ్యక్తిగతంగా తాను ఎవరినీ కించపరచలేదన్నారు. తనకు కూడా ఆత్మవిశ్వాసం ఉందని.. అమ్మవారి మీదనో, తల్లి మీదనో ఒట్టేసే అవసరం తనకు లేదని చెప్పారు. దేవుళ్లపై ప్రమాణం చేసే సంప్రదాయాన్ని పాటించట్లేదని స్పష్టం చేశారు. దీనిపై తగిన సమయంలో జవాబిస్తానని వెల్లడించారు.