Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ పట్టణంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రత్లామ్-అంబేద్కర్ నగర్ డెమూ మార్గంలో వెళ్తున్న ఓ లోకల్ రైలు ప్రీతమ్ నగర్ స్టేషన్కు చేరుకోగానే ఆ రైల్లో మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన రైలు లోకో పైలెట్లు, స్టేషన్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. రైలు జనరేటర్ కార్లో ముందుగా మంటలు చెలరేగాయని, ఆ తర్వాత బోగీ అంతటికి విస్తరించాయని అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపేయడంతో పెను ముప్పు తప్పిందని, మంటలు ప్రయాణికుల బోగీలకు వ్యాపించకుండా ఆగిపోయాయని అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.