Authorization
Wed April 30, 2025 01:48:16 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ లో 70 ఏళ్ల కిందట అంతరించిపోయిన చీతాల సంతతిని మళ్లీ వృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇటీవల నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి పలు చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ అభయారణ్యంలో వదిలిపెట్టారు. అయితే, ఆ చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల రెండు చీతాలు మరణించగా, తాజాగా ఓ ఆడ చీతా మృతి చెందింది. దీని పేరు దక్ష. దీన్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. కొన్ని నెలల వ్యవధిలో మూడు చీతాలు మరణించడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. తొలుత నమీబియాకు చెందిన సాషా అనే చీతా కన్నుమూసింది. సాషా... ఆడ చీతా. దీని వయసు ఆరేళ్లు. ఇది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో మరణించినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్ అనే మగ చీతా ప్రాణాలు విడిచింది. ఇది నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలతో మరణించినట్టు అధికారులు తెలిపారు.