Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. విజయపుర జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మసబినల్ గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది. ఈవీఎంలు, వీవీప్యాట్లను మారుస్తున్నారంటూ గ్రామస్థులు వారిపై దాడి చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ధ్వంసం చేశారు.
ఈ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది ఓటింగ్‌ను మధ్యలోనే నిలిపివేసి ఈవీఎంలను తరలిస్తున్నట్లు వార్త గుప్పుమంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో ముగ్గురు అధికారులు రెండు ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి కారులో పెట్టారు. దీంతో పోలింగ్‌ను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. కారును ధ్వంసం చేసి ఈవీఎంలను పగలగొట్టారు. ఈ ఘటనలో పోలింగ్ సిబ్బంది వాహనాలు, ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
దీనిపై డిప్యూటీ కమిషనర్ విజయ్మహంతేశ్ స్పందిస్తూ.. పోలింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. ‘‘అవి అదనంగా ఉన్న ఈవీఎంలు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అందుబాటులో ఉంచుతారు. మసబినల్లో వాటి అవసరం లేకపోవడంతో మరో పోలింగ్ కేంద్రానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాని గురించి ఓటర్లకు అధికారులు వివరణ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్కడ ఓటింగ్ కొనసాగుతోంది’’ అని వెల్లడించారు. ఈ ఘటనలో 23 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలిపింది.