Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని కొల్లాం జిల్లాలోని తాలూకా ఆసుపత్రిలో బుధవారం దారుణం జరిగింది. 23 ఏళ్ల మహిళా డాక్టర్ ను ఓ రోగి పొడిచి చంపాడు. కొట్టక్కరలోని ఆసుపత్రిలో 22 ఏళ్ల డాక్టర్ వందనాదాస్ హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తోంది. బుధవారం కాలి గాయంతో ఉన్న ఓ వ్యక్తికి డ్రెస్సింగ్ చేస్తోంది. ట్రీట్మెంట్ సమయంలో అతను హఠాత్తుగా ఆగ్రహానికి గురయ్యాడు. రెచ్చిపోయిన అతను అక్కడున్న వారందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాదు, సదరు మహిళా డాక్టర్‌పై కత్తెర, ఇతర ఆయుధాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఈ దాడిలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. దీనిపై భారత వైద్య మండలి ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటల రాష్ట్ర సమ్మెకు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. మరోవైపు, మహిళా డాక్టర్ హత్యపై కేరళ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రత్యేక సెషన్ ను ఏర్పాటు చేసి అత్యవసరంగా ఈ కేసును విచారించింది. ఒక వ్యక్తి అసాధారణంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారని, రోగులకు ఏమైనా జరిగితే వారిని నిందించగలమా? అని వ్యాఖ్యానించింది. కాగా, దాడికి పాల్పడిన వ్యక్తి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. అతను సస్పెన్షన్ కు గురయ్యాడు.