Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత సోనియా గాంధీ జూన్ తొలి వారంలో హైదరాబాద్ రానున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బోయినపల్లిలో నిర్మించతలపెట్టిన ‘గాంధీ ఐడియాలజీ సెంటర్’ భవనానికి శంకుస్థాపన చేస్తారు. వైఎస్సార్ హయాంలో బోయినపల్లి శివారులో కాంగ్రెస్ పార్టీకి పదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా బుధవారం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది.
ఈ భవనంలో గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతోపాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేలా థియేటర్, గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక చాంబర్, పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా భవనాన్ని డిజైన్ చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించనున్నట్టు పీసీసీ తెలిపింది.