Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదనే అక్కసుతో ఓ యువతి... అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి మరీ కత్తిపీటతో దాడిచేసి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలేనికి చెందిన ఒమ్మి నాగశేషు(25) తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన కుర్లు డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ఆరేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో నాగశేషు అవసరాల కోసం డిబేరా రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబసభ్యులకు తెలిసింది. ఆయనకు మరో యువతితో ఏడాది కిందట వివాహం జరిపించారు. ఈ పెండ్లి గురించి ఇటీవల డిబేరాకు తెలిసి నిలదీసింది. తనకు రావాల్సిన డబ్బు, గొలుసును ఇవ్వాలని పలుమార్లు కోరింది. ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకుంది. నాగశేషును చంపాలని నిర్ణయించుకున్న డిబేరా తన స్నేహితుడైన శివన్నారాయణ సాయం కోరింది. బైకుపై అతనితో కలిసి బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న అతడిని గట్టిగా నిలదీయడంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తిపీటతో డిబేరా దాడిచేసింది. అడ్డుకోబోయిన నాగశేషు తల్లి గంగపై... శివన్నారాయణ కర్రతో దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు... 108 వాహనంలో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.