Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో ఓవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ హవా సాగిస్తూ, మెజారిటీ మార్క్‌కు చేరువవుతుండటంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఎక్కడా తమ నేతలు పక్క చూపులు చూపకుండా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా చూసేందుకు జాగ్రత్త పడుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. శనివారం సాయంత్రం కల్లా ఎన్నికైన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అట్నించి నేరుగా తమిళనాడు తరిలించే విషయంలో అక్కడి తమ మిత్రపక్షమైన డీఎంకేతో సంప్రందిపులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మెజారిటీ దాటినప్పటికీ తమ ఎమ్మెల్యేలకు రెండో అతిపెద్ద పార్టీ గాలం వేసే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నేతల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన గోవా, తదితర రాష్ట్రాలలో పార్టీకి ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గెలిచిన ఎమ్మెల్యేలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెండు, మూడు ప్లాన్లు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్లాన్ 1,2 ప్రకారం ఎమ్మెల్యేలను తమిళనాడుకు, హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించే అవకాశాలున్నాయని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కాగా, కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటే అవకాశాలు ప్రస్పుటంగా రౌండ్ రౌండ్‌కు వెలువడుతుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేస్తున్నారు.