Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూర్ : కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో మోడీ వేవ్ ముగిసిందని సంజయ్ రౌత్ అన్నారు. భజరంగ్ బలి కూడా కాంగ్రెస్ వైపే ఉన్నట్టు స్పష్టమైందని అందుకే బజరంగ్ బలి గధ బీజేపీపై పడిందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభ మసకబారిందని, ఇక తమ వేవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ సర్కార్‌ను సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అధ్యక్షతన సమావేశం కానున్నామని చెప్పారు. రానున్న సార్వత్రిక సమరానికి ఇక సంసిద్ధమవుతామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాల ఓటమిగా అంతకుముందు సంజయ్ రౌత్ అభివర్ణించారు. కర్నాటకలో బీజేపీ ఓడిపోతే ఘర్షణలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని, కానీ కర్నాటక ప్రస్తుతం సంతోషంగా, ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఘర్షణలు ఎక్కడ చెలరేగాయని రౌత్ ప్రశ్నించారు. ఇది మోడీ, షాల పరాజయమని ఆయన అభివర్ణించారు. కర్నాటకలో ఇవాళ జరిగింది 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. హనుమాన్, ప్రధాని మోడీ ఇమేజ్‌లను ట్వీట్ చేసిన రౌత్ హనుమాన్ ఫొటోపై భజరంగ్‌బలి 130+ స్ధానాలు అని, ప్రధాని మోడీ ఇమేజ్‌పై భజరంగ్‌దళ్ 60+ స్ధానాలని రాసుకొచ్చారు. నియంత పోకడలను ప్రజలు నిలువరించగలరని కర్నాటక ప్రజలు స్పష్టం చేశారని రౌత్ అన్నారు.