Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : 'ద కేరళ స్టోరీ' సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 5న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. అయితే మూడో తేదీనే విడుదలను నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేరళ హైకోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టీజర్‌ను వీక్షించిన హైకోర్టు న్యాయమూర్తులు విడుదలపై స్టేకు నిరాకరించారు. కేరళ నుంచి 32 వేల మంది యువతులను తీవ్రవాద సంస్థ ఐసిస్‌లోకి చేరేలా వారి ముస్లిం స్నేహితులు ప్రలోభపెట్టారని సినిమాలో పేర్కొనడాన్ని పిటిషన్లో ఖుర్బాన్ అలీ ఆక్షేపించారు. సమాజంలోని వివిధ సమూహాల మధ్య విద్వేషాన్ని పెంచడమే ఈ సినిమా ధ్యేయమని హైకోర్టులో వాదించారు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అలీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో వాదనలు వినిపించనున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విననుంది.