Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వందల రోజులకు చేరుకున్న నిరాహారదీక్షలు
- కొనసాగుతున్న తిగుల్ మండల సాధన సమితి ఆందోళనలు
నవతెలంగాణ-జగదేవపూర్
జిల్లాలో ఎనిమిది, పది గ్రామాలతో కొత్త మండలాలు ఏర్పాటు చేసిండ్రు. విస్తీర్ణం పరంగా, జనాభా ప్రకారం పెద్ద గ్రామాలను మండలం చేస్తలేరు. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొత్త మండలాలను చేయాలంటూ తీగుల్‌లో రెండు వందల రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు. స్వరాష్ట్ర పోరు స్ఫూర్తితోనే కొత్త మండలం సాధించుకుంటామని కరాఖండిగా చెబుతున్నారు. అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు. తీగుల్ను మండలం చేయాలని కోరుతూ అన్ని పార్టీలు, యూత్ సంఘూలు కలిసి తీగుల్ మండల సాధన సమితి ఏర్పాటు చేశారు. ఆగష్టు ఒకటి నుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించి రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. గ్రామంలో పెద్ద ఎత్తున్న ర్యాలి నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్, వైఎస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, కుల సంఘూల నాయకులు దీక్షలో పాల్గొని సంఘిభావం పలికారు. ఆందోళన బాటన కాకుండా శాంతియుతంగానే దీక్షలు చేపడుతున్నారు. వంద రోజులకు తిగుల్ నుంచి కొండపోచమ్మ వరకు పాదయాత్ర చేపట్టారు. అమ్మవారికి మండలం కావాలని ముడుపు కట్టారు. నూట యాబై రోజులకు ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందించారు. అంతకు ముందు గణేష్ పల్లి చౌరస్తాలో వంటా వార్పు చేపట్టారు. ఇలా ఎన్నో రకాలుగా నిరసనలు చేస్తున్నారు.
ఏడేళ్ల క్రితమే..
కొత్త మండలాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గేజిట్ విడుదల చేసింది. ఆ సమయంలో జిల్లాలో నాలుగు గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటించారు. గజ్వేల్ నియోజకవర్గంలో మర్కూక్ ను మండలంగా చేయడంతో అదే సమయంలో తిగుల్ గ్రామాన్ని మండలం చేయాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావుకు తీగుల్ గ్రామ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. గణేష్ పల్లి గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి తిగుల్ మండలం చేయాలని కోరుతున్నారు. అలాగే ఇటివల జిల్లాలో మరో రెండు కుకునూర్ పల్లి, భూంపల్లిలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి తిగుల్ మండల సాధన సమితిని ఏర్పాటు చేసుకుని పార్టీలకు రిలే నిరాహారదీక్షలకు శ్రీకారం చుట్టారు.
ఉద్యమాలకు చిరునామా తీగుల్ గ్రామం
రాష్ట్రంలో ఏ ఉద్యమం ప్రారంభమైన ఆ ఉద్యమం తీగుల్‌లో వెంటనే ప్రారంభమవుతుంది. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నాయకులు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమ జెండాను ఎగురవేసి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉద్యమ గ్రామమని తీగుల్ చరిత్రలో పేరు సంపాధించింది. అప్పటి నుంచి 2019 స్థానిక సంస్థల ఎన్నికల వరకు మూడు పర్యాయాలు తీగుల్‌లో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా నిలబడింది. కొత్త మండలాల సమయంలో ప్రభుత్వం తీగుల్ ను మండలం చేయకపోవడం వల్ల అధికార పార్టీకి గ్రామస్తులు దూరమయ్యారు. ప్రస్తుతం తీగుల్ ను మండలం చేస్తే మళ్లీ అధికార పార్టీ వైపు ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. తీగుల్ గ్రామానికి రవాణా సౌకర్యం బాగానే ఉంది. చుట్టూ ముట్టు పన్నెండు గ్రామాలు తిగుల్ మండలం కావాలని కోరుకుంటున్నాయి.
ఎన్నికల బహిష్కరణకు సిద్ధం
తీగుల్ను నూతనంగా మండలం చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి రెండు వందల రోజులకు చేరుకుంటాయి. తీగుల్ను మండలంగా ప్రకటించకుంటే రానున్న సాధారణ ఎన్నికలను బహిష్కరించేందుకు మండల సాధన సమితి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. గురువారం గ్రామంలో నిరసనలు చేపట్టనున్నారు. అలాగే మరోసారి కలెక్టర్ కు వినతిపత్రం అందించి ఉద్యమ కార్యచరణకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు స్పందించి మండలంగా ప్రకటించాలని కోరుతున్నారు.
ప్రజల ఆకాంక్షను గుర్తించాలి
తీగుల్ మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రెండు వందల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం అందజేశాం. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. కొండపో చమ్మ వరకు పాదయాత్ర చేసినం. ప్రజల ఆకాంక్షను గుర్తించి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి.
- భానుప్రకాష్ రావు, సర్పంచ్
మండలంగా ప్రకటించాలి
మాది తీగుల్ గ్రామం. జగదేవపూర్ మండలంలోనే పెద్ద గ్రామం. సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉంది. మండల వ్యవస్థ ఏర్పాటు అప్పుడే మండలం కావాల్సి ఉండగా కాలేదు. మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి తిగుల్ ను మండలంగా ప్రకటించాలి.
- కె.భూమయ్య, తీగుల్ మండల సాధన సమితి సభ్యుడు