Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర దేశాల క్రీడాకారులతో చర్చలు
- ధర్నాను సందర్శించిన సత్యపాల్ మాలిక్, బీజేపీ నేత చౌదరి బీరేంద్ర సింగ్
- 9053903100 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలపండి
- నిరసన ప్రాంగణంలో మల్లయోధులను వేధిస్తున్నారు: వినేశ్ ఫోగట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెజ్లర్లు చేస్తున్న నిరసనను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మద్దతు కోసం ఇతర దేశాలలోని ఒలింపియన్, రెజ్లర్లలను సంప్రదించనున్నట్టు మల్లయోధులు తెలిపారు. దీనికోసం చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించడంతో తమ ''ఆందోళనను ప్రపంచవ్యాప్తం'' చేయాలని నిర్ణయించుకున్నారు. జాతీయ రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే మే 21 తరువాత భారీ స్థాయిలో పిలుపు ఉంటుందని ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ పేర్కొన్నారు. ''మేం ఈ నిరసనను ప్రపంచ వ్యాప్తం చేస్తాం. మేం ఇతర దేశాలలో ఒలింపియన్లు, ఒలింపిక్ పతక విజేతలను సంప్రదిస్తాం. వారి మద్దతు కోరుతూ వారికి లేఖ రాస్తాం'' అని సాక్షి మాలిక్ తెలిపారు. ఇతర దేశాలకు చెందిన ఒలింపియన్లు, అగ్రశ్రేణి అథ్లెట్లకు లేఖలు రాయడతో తమ ఆందోళనను ప్రపంచ వ్యాప్తం చేయాలని భావిస్తున్నట్టు సాక్షి మాలిక్ తెలిపారు. ''మేం జంతర్ మంతర్ వద్ద కూర్చున్నాం. మా నిరసనలు ముందుకు సాగాలంటే, మేం కూడా ఇక్కడి నుంచి వెళ్లాలి. మేం ఇతర దేశాల ఒలింపిక్ ఛాంపియన్‌లు, అథ్లెట్లకు కూడా లేఖ రాస్తున్నాం. వారు కూడా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం'' అని అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన 23 రోజులు పూర్తి చేసుకుంది. జంతర్ మంతర్ వద్ద ధర్నా శిబిరాన్ని సోమవారం మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బీజేపీ నేత చౌదరి బీరేంద్ర సింగ్, భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
మద్దతు తెలపండి..
9053903100 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి దేశంలో కుమార్తెల ఉద్యమనికి మద్దతు తెలపాలని రెజ్లర్ల సాక్షి మాలిక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం జంతర్ మంతర్ నుంచి కన్నాట్ ప్లేస్ వరకు భారీ మర్చ్ నిర్వహించారు. రెజ్లర్లతో పాటు వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. ప్లకార్డులు చేబూని ప్రదర్శన చేపట్టారు. మల్లయోధులు తొలిసారిగా జంతర్ మంతర్ దాటి కన్నాట్ ప్లేస్‌ను సందర్శించారు. అక్కడ ప్రజలతో రెజ్లర్ వినేష్ పోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తో సహా రెజ్లర్లు సంభాషించారు.
ఇతర ప్రాంతాలకు ఉద్యమం: వినేశ్ ఫోగట్
''మేం మా జంతర్ మంతర్ నిరసన ప్రదేశం వద్ద మాత్రమే నిరసన చేస్తాం. మేం ఇతర ప్రదేశాలకు వెళ్లి నిరసనను తీసుకెళ్తాం. ఎందుకంటే మా ధర్నా ప్రాంగణం దాదాపు జైలుగా మారుతున్నట్టు మేం భావిస్తున్నాం. అందువల్ల, మేం మరింత మంది ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మహిళా రెజ్లర్ల గురించి మాత్రమే కాదు. ఇది దేశంలోని ప్రతి ఒక్క కుమార్తె గురించి. మేము కన్నాట్ ప్లేస్‌కి వెళ్లి, మేము ఎందుకు వీధుల్లో ఉన్నామో ప్రజలకు చెప్పాం. న్యాయం కోసం మా పోరాటంలో వారి మద్దతు కోరాలని నిర్ణయించుకున్నాం'' అని ఫోగట్ అన్నారు. ఆదివారం రాత్రి తమ ఆందోళనను కించపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆరోపించారు. నిరసన ప్రాంగ ణంలో మల్లయోధులను వేధిస్తున్నారని అన్నారు. ''కొందరు మా నిరసనను భంగపరిచేందుకు ప్రయత్నించారు. మేము నిరసన ప్రదేశంలో మా పరుపులను తీసుకువస్తున్నప్పుడు ఇది జరిగింది'' అని అన్నారు. ''మమ్మల్ని వెంబడిస్తున్నారు. కొందరు రికార్డింగ్ చేస్తారు. ఫోటోలను క్లిక్ చేశారు. మేము వారికి (ఆపివేయమని) అడిగినప్పుడు వారు వినరు. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు (మహిళలు) కూడా ఇక్కడ (మల్లయోధులు వేసిన టెంట్ లోపల) నిద్రించడానికి ప్రయత్నించారు'' అని వినేశ్ పేర్కొన్నారు.
గుర్తు తెలియని వారిని ధర్నా ప్రాంగణంలోకి...
''మాకు తెలియని మహిళలను రాత్రిపూట లోపలికి పంపుతున్నారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. నిరసన ప్రదేశంలో జరగకూడదనుకుంటున్నాము. ఇది చెడ్డ పేరు తెచ్చి, నిజం, న్యాయం కోసం జరిగే మా పోరాటాన్ని దెబ్బతీస్తుంది'' అని అన్నారు. రెజ్లర్లు కేవలం నిరసన స్థలానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని ప్రతి పౌరునికి తమ కష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు. ''జంతర్ మంతర్ వద్ద మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఒక మూలకు నెట్టబడుతున్నామని మేము భావిస్తున్నాము. కాబట్టి మనం ఇతర ప్రదేశాలలో ఎంత ఎక్కువ ఆందోళన చేసి, ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా తెలియజేస్తే, అంత మంచిది'' అని అన్నారు. ''మే 21ని (బ్రిజ్ భూషణ్‌పై చర్య కోసం) గడువుగా నిర్ణయించాము. ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే, ఆ తేదీ తరువాత మా ఆందోళనను ఉధృతం చేస్తా'' అని వినేష్ తెలిపారు. ''అవి (చట్టపరమైన ప్రక్రియలు) కొనసాగుతున్నాయి. నేను ఇప్పుడు వాటిని చెప్పలేను. ఏదైనా కాంక్రీటుగా జరిగిన తరువాత మేము మీకు తెలియజేస్తాము'' అని చెప్పారు. ''విచారణ కొనసాగుతుంది. కాబట్టి నేను వివరాలను ఇవ్వలేను. కానీ స్టేట్‌మెంట్‌లు ఇప్పటికీ రికార్డ్ చేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత, మేము దానిని ఖచ్చితంగా ప్రకటిస్తాము'' అని అన్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక ప్యానెల్‌కు అన్ని పత్రాలను అందజేయండి
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటంలో ''మొదటి అడుగు''గా రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు బాధ్యత వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నిర్ణయాన్ని పేర్కొన్నారు. మే 12న ఐఓఏ, డబ్ల్యూఎఫ్‌ఐ సెక్రెటరీ జనరల్‌కు రాసిన లేఖలో ఆర్థిక అంశాలతో సహా అధికారిక పత్రాలను దాని డబ్ల్యుఎఫ్‌ఐ తాత్కాలిక ప్యానెల్‌కు అందజేయాలని కోరింది. అవుట్‌గోయింగ్ ఆఫీస్ బేరర్‌లకు ఫెడరేషన్ నిర్వహణలో ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేసింది.''ఇది (ప్రస్తుత డబ్ల్యూఎఫ్‌ఐ రద్దు) న్యాయం కోసం మా పోరాటంలో మొదటి అడుగు. మా పోరాటం సరైనదేనని స్పష్టం చేసింది. ఇది మాకు విజయం. మాకు న్యాయం జరిగే వరకు మేము నిరసన కొనసాగిస్తాం. పోరాడుతాము'' అని రెజ్లర్లు తెలిపారు. కొత్త డబ్ల్యుఎఫ్‌ఐ ఆఫీస్ బేరర్‌లను ఎన్నుకునే ప్రక్రియ 45 రోజుల వ్యవధిలో పూర్తవుతుందని, తిరిగి ఎన్నికైన సంస్థకే బాధ్యతలు అప్పగిస్తామని ఐఓఏ ముగ్గురు సభ్యుల తాత్కాలిక కమిటీ స్పష్టం చేసింది. ''ఎన్నికలు జరిగిన తరువాత, పరిపాలనా అధికారాలు డబ్ల్యూఎఫ్‌ఐకి తిరిగి వెళ్తాయి. కొత్తగా ఎన్నికైన అధికారులు నిర్వహిస్తారు. ఇది తాత్కాలిక చర్య మాత్రమే.సమాఖ్య వ్యవ హారాలను తాత్కాలికంగా నిర్వహించడం'' అని ఒక అధికారి తెలిపారు.