Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరణం లేని చరణం.. | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

మరణం లేని చరణం..

అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్‌ - జనవరి12న జయంతి, వర్ధంతి
- పీఎస్‌ రవీంద్ర, 6309638395
తను శవమై .. ఒకరికి వశమై
తనువు పుండై.. ఒకరికి పండై
తను ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై
       వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళల పరంగా ఎవరు రాయలన్నా పైన పేర్కొన్న అలిశెట్టి కవిత ఉదహరించకుండా రాయలేరు. అందుకు కారణం..ఈ కవితకు ముందుగానీ తరువాతగానీ ఇంతబలంగా రాసిన వారులేరు. చిన్న చిన్న మాటలతో శక్తివంతమైన అర్థాన్ని చెప్పడమే ప్రభాకర్‌ ప్రత్యేకత. అలిశెట్టి అంటేనే తెలుగు కవిత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన కవిత్వం నదిలో ఉప్పొంగే కడలి కెరటం. భావోద్వేగపు భాషా తరంగం. ఉద్రేకపు ఉక్కు కవచం. వ్యక్తిత్వం.. సమాజంలోని అంతరాలను తొలగించే అక్షరీత్వం. ఆయన జీవించింది 38 ఏండ్లే అయినా ప్రపంచ సాహిత్యంలో వెయ్యి సంవత్సరాలు గడిచిన చెరగని ముద్ర వేశారు. శ్రీశ్రీ తర్వాత ప్రజల్లో అంతటి స్ఫూర్తినింపిన కవిత్వం ఏదైనా ఉందంటే అది అలిశెట్టి రచనత్వం. ఆయన పుట్టింది, చనిపోయింది జనవరి 12 ఒకేరోజు కావడం విశేషం. అలిశెట్టి జయంతి, వర్థంతిని పురస్కరించుకుని ఈ వారం ఆదివారం అనుబంధం 'సోపతి' సందర్భోచిత వ్యాసం.
       అలిశెట్టి ప్రభాకర్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలోని లక్ష్మి-చిన్న రాజం దంపతులకు 1954 జనవరి 12న జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా కరీంనగర్‌కు రావడంతో పదో తరగతి వరకు విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. అదే సమయంలో తండ్రి అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో తిరిగి తమ స్వస్థలం జగిత్యాలకు చేరుకున్నాడు. అక్కడ ఇంటర్మీడియట్‌లో చేరినప్పటికి పలు కారణాల రీత్యా చదువు కొనసాగలేదు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం పట్ల అమితమైన అసక్తి చూపేవాడు. ఈ క్రమంలో పండగల సందర్భంగా పత్రికలకు బొమ్మలు గీయడం ప్రారంభించాడు. జగిత్యాలలోని సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వంలోకి ప్రశేశించాడు. 1974లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో 'పరిష్కారం' మొట్టమొదటిగా అచ్చయిన కవిత. జీవనోపాధి కోసం ఫొటోగ్రఫిని ఆశ్రయించి జగిత్యాలలో 1976లో పూర్ణిమ పేర స్టూడియో ప్రారంభించాడు. 1978లో భాగ్యతో పెళ్లి , సంగ్రామ్‌, సంకేత్‌ సంతానం. అక్కడి నుంచి కరీంనగర్‌ చేరుకోని స్టూడియో శిల్పి 1979లో నెలకొల్పారు. అనంతరం 1983లో హైదరాబాద్‌లో స్టూడియో చిత్రలేఖ ప్రారంభించారు. జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరకంటూ నమ్మిన వ్యక్తి ప్రభాకర్‌.
'ఎర్రపావురాలు'తో మొదలు...
       అనుదినం సాహిత్యమే ఊపిరిగా జీవించిన ఆయన మినీ కవిత్వాన్ని పరిచయం చేశారు. పండితుల పాండిత్యం, సందులు, సమాసాలు లేని జనాలకు అర్థమయ్యే వాడుక భాషలోనే కవితలు రాయడం అలిశెట్టి ప్రత్యేకత. చిన్న పదాలతోనే అర్థవంతమైన కవితలకు ముడిపెట్టిన నేర్పరి. చిన్న కవిత్వమంటే పత్రికల్లో మిగిలిపోయిన ఖాళీలను నింపే రాతలని గేలిచేసే కాలంలో మినీ కవిత్వం రగిలే గుండెల మంటల జ్వాలలకు ప్రతిరూపాలని చాటిన వెలుగు రేఖ ఆయన. బడుగు బలహీన వర్గాల దైనందిన జీవితంలోని అన్ని కోణాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించిన పదబంధాలే 'రక్త రేఖలు' కవిత్వం. మొట్టమొదట 1979లో 'ఎర్ర పావురాలు'తో మొదలైన కవితా సంకలనం ఆయన జీవిత చరమాంకం వరకు ఆగని ప్రస్థానంగా మారింది. అదే యేడు మరో రెండు కవితా సంకలనాలు మంటల జెండాలు, చురుకలు ప్రచురితమయ్యాయి. జింబో, వజ్జల శివకుమార్‌, వారాల ఆనంద్‌, పీఎస్‌. రవీంద్రలతో కలసి 1981లో లయ కవితా సంకలనం వెలువరించారు. 1985లో రక్తరేఖ, 1989లో ఎండమావి, 1990 సంక్షోభ గీతం, 1992లో సీటిలైఫ్‌ సంకలనాలు వెలువడ్డాయి. 1993 జనవరి 12న ఆయన పుట్టిన రోజే ఆనారోగ్యంతో చివరి శ్వాస విడిచారు. అనంతరం ఆయన కవితలను 'మరణం నా చివరి చరణం కాదు' సంకలనాన్ని 1994లో విరసం ప్రచురించింది. చివరగా అన్ని సంకలనాలను కలిపి 'అలిశెట్టి ప్రభాకర్‌ కవిత'గా ఆయన మిత్రలంతా కలిసి 2013లో సమగ్ర కవిత్వాన్ని ప్రచురించారు.
అకట్టుకున్న చిత్రకళా ప్రదర్శనలు ...
       అలిశెట్టి ప్రభాకర్‌ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలకు అనూహ్య మైన స్పందన లభించింది. 1976లో వేములవాడలో ప్రారంభమైన నటరాజ కళానికేతన్‌ వినూత్న మైన సాహితీ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా చిత్ర కళాప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కవిత్వంతో పాటు అందుకు సంబంధించి గీసిన చిత్రాలు సహా ఉన్న ప్రదర్శన గొప్ప ఆదరణ చూరగొంది. అందులో అలిశెట్టి ప్రభాకర్‌ కవితలు సహితం ఉన్నాయి. అది మొదలు స్వయంగా చిత్రకారుడైన ఆయన తన కవితలకు చిత్రాలు, ఫొటోలు జోడించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూని వర్సిటీ మొదలు నగరంలోని అనేక కళాశాలల్లో ప్రదర్శనలు జరిగాయి. అంతటికే పరిమితం కాకుండా కరీంనగర్‌, జగిత్యాల లాంటి తెలంగాణలోని అన్ని పట్టణాలతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అనేక కళాశాలల్లోనూ నిర్వహించిన ప్రదర్శనలకు విద్యార్థుల నుంచి వచ్చిన స్పందన అబ్బురపరిచింది.
నగర జీవితం...
       కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన అలిశెట్టి ప్రభాకర్‌ అక్కడ ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చుట్టు ఉన్నా నగర వాతావరణాన్ని తన కవితల్లో చిత్రకరించారు. ఈ క్రమంలో ఒక దిన పత్రికలో రోజు వారీ రాసేందుకు అవకాశం లభించింది. ఏ రోజుకు ఆరోజు నిత్యనూతనంగా చిన్న చిన్న మాటల్లోనే గొప్ప అర్ధాన్నిచ్చే రచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఆయనకు ఈ కవితల ద్వారా వచ్చిన రెమ్యునరేషనే కొంత అధారమైంది. ఆయన చనిపోయిన రోజు సామాన్య పత్రికా పాఠకులు కూడా నివాళులు అర్పించడం ఆ కవితలకు వచ్చిన ఆదరణకు నిదర్శనం. బంజారాహిల్స్‌ విషయమై చెప్ఫాల్సి వచ్చినప్పుడు 'ఎవరీ హై హీల్స్‌.. బంజారాహిల్స్‌' అంటూ గొప్పగా చెప్పడం ఒక ఉదాహరణ. ఇలాంటి కవితల వల్లె సామాన్య ప్రజానీకాన్నీ అకట్టుకోగలిగారు. ఆయన వెళ్లిన తొలినాళ్లలో నగరం ప్లాస్టిక్‌ పువ్వుల్లా మిల మిలా మెరిసినా ఎందరికో బతుకునిచ్చిన భాగ్యనగరం ఆయనకు క్షయ వ్యాధినిచ్చింది. చనిపోతాననే భయం లేకుండా తన అంతరాత్మ మాట తప్ప మరెవ్వరి మాట వివని ఆయన ఎవరికీ రుణపడకూడదని భావించాడు. అందుకే ఎవరినుంచీ సాయం కూడా పొందలేదు. తాను ఆరోగ్యంతో బాధపడుతున్నా కూడా విప్లవకవి చెరబండ రాజుకు ఆర్థికసాయం అందించాలని తాప త్రయ పడటం ఆయన మానవత్వానికి నిదర్శనం. తన కష్టాల గురించి ఆలోచించకుండా ఎదుటివారి కన్నీళ్లను తుడిచే వ్యక్తిత్వాన్నే ఆయన జీవితమంతా కొనసాగించాడు. అలిశెట్టికి స్త్రీలంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉండేవి. అందుకే మహిళల కష్టాల గురించి అనేక కవితలు రాయమడే కాకుండా వాటికి సంబం ధించి చిత్రాలు కూడా గీశాడు. అంగట్లో అమ్మడా నికి ఉన్న స్త్రీలను అందరూ వాడుకుంటూనే చీత్కరించుకునే ఈ సమాజంలో ఆమె పట్ల తన అనురాగాన్ని, అనురక్తిని 'వేశ్య' అనే కవితలో అభివర్ణించాడు.పైన పేర్కొన్నట్టు తను శవమై ..ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకరికి పండై, తను ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై ఈ ఒక్క కవిత చాలు అలిశెట్టిని ఎల్లలు లేని కవితా లోకంలో నిక్షిప్తం చేసి నిలపడానికి.
జగిత్యాల జైత్రయాత్రతో స్ఫూర్తి...
       1978లో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర ఆయనపై తీవ్ర ప్రభావం చూపింది. అది మొదలు తుది శ్వాస విడిచేదాక అలిశెట్టి ప్రభాకర్‌ ప్రజల పక్షాన నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉద్య మాన్ని తన కవితా ప్రభంజనం తోనే నడిపిం చాడు. యువతరాన్ని మేల్కొల్పాడు. ఆలోచింప జేశాడు. జగిత్యాల, కరీం నగర్‌, హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆలోచన సరళి విడలేదు. ఉద్యమం పై వచ్చిన ప్రతి నిర్భంధంలోనూ పదునైన కలంతో తన వంతు పాత్ర పోషించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగానే రచనలతో పాటు జీవనం సాగించారు. మృత్యువు అవహి స్తున్న సమయంలోనూ 'మరణం నా చివరి చరణం కాదు' అని నినదిస్తూ కవితా రచన కొన సాగించారు. ఇవి ఒక పత్రికలో ప్రచురణ కోసం పంపిన ఒకటి రెండు రోజుల్లో మృతి చెందారు. ఆయన మరణానంతరం వచ్చిన ఈకవిత ఆయన స్వభావాన్ని తేటతెల్లం చేసింది. మృత్యువును ధిక్కరిస్తూ ముందుకు సాగిన వైనం అకట్టుకుంది. ఆయన మృతి చెంది 30ఏండ్లు గడుస్తున్నా ప్రజల నాల్కలపై కవితలు కదలాడుతూనే ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తరువాత అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉదహరించిన కవితలు అలిశెట్టి ప్రభాకర్‌వే కావడం గమనార్హం.
మరణం చివరి చరణం కాని వాడు
అక్షర సూరీడు సమసమాజ స్వాప్నికుడు
గతి తప్పిన వ్యవస్థకు చురకలంటించినవాడు
కాలే కడుపుల మంటల జెండాలెగరేసినవాడు
అక్షర జ్వాల అలిశెట్టి ప్రభాకర్‌..
ఆయన అస్తమించినప్పటికీ రాసిన కవిత్వం నెగడులా రగులుతూనే ఉంటుంది. దోపిడీ, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఆ సెగ తగులుతూనే ఉంటుంది.

సంఘర్షణ
హృదయమంతా రుధిరమైపోయి.
నరాల స్వరాలు భాస్వరాన్ని
గుర్తుకు తెస్తున్నప్పుడు
మనిషి
అచేతనంగా గాలికి కొట్టుకునే
కిటీకీ రెక్కల్లాంటి వాడు కాడని
నిరూపించుకున్నప్పుడు
ఎక్కడో అట్టడుగున
ఇంకా ఇంకిపోని చైతన్యం
ఊటలా ఉధృతమౌతున్నప్పుడు
ఏ దానవత్వాన్నో ప్రతిఘటించినప్పుడు
రహస్యాల తిమిరంలో
హేతువనే మొక్కలున్నాయని
తెలియని నీకల్లవెనుక కళ్లకి
ఈ సుచరిత్రకి మురికి గీతల్లా
మిగిలిపోతాయని నాకైతే
కచ్చితంగా తెలుసు.
అందుకే అసలైన సువర్నంలోంచి
మలిన వర్ణాన్ని సృష్టిస్తోంది.
కాలం..కాదు లోకం.
- అలిశెట్టి

అలిశెట్టి స్వీయ ప్రకటన
       మధ్య తరగతి కౌటిట్లోని మాధుర్యం కూడా తరిగిపోయి
పరిపరి విధాల మానసిక వేదనతో పాటు
పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం
మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో
మళ్లీ మళ్లీ ఊపిరిత్తుల్లో క్షయ రాజుకోవడం
పరిపాటయి పోయింది.
పుట్టినగడ్డ నుంచి ఇక్కడికి రావడమే పొరపాటయిపోయింది.
వాస్తవానికి -అవసరానికి నన్ను వినియోగిచుకున్న
వాళ్లే నాపై జాలీ నోటులా జాలి కురిపించి
కుళ్లిన ఆసుపత్రిలా పక్కన జేరి పరామర్శించినా
నానించి ఏమీ ఆశించని వాళ్లే నాకెంతగానో సహకరించారు.
'ఐసోనెక్స్‌' నుంచి 'సైక్లోసెరిన్‌'వరకూ ఉచితంగా
మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు.

తమ్ముడూ తమ్ముడూ
నువ్వొచ్చేటపుడు తప్పక
పిడికెడు కల్లోలిత ప్రాంతాల మట్టినైనా తీసుకురా
పోరుదారిలో నేలకొరిగిన ఒక అమరవీరుని
జ్ఞాపకమైనా మోసుకురా
మళ్లీమళ్లీ నాకు జగిత్యాల గుర్తొసుతంది
జైత్రయాత్ర నను కలవరపెడుతుంది..
- అలిశెట్టి

ప్రభాకర్‌.. నేను...
       అది 1977వ కాలం. నాకు ప్రభాకర్‌తో అప్పటికీ నాకు పరిచయం లేదు. ఒకరికొకరం మాట్లాడుకున్నాం. భావాలను పంచుకున్నాం. కానీ అది కవితల్లోనే. అప్పట్లో విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రజ్యోతి వారపత్రికకు నేను కవితలు రాసేవాడిని. అలిశెట్టి కూడా ఇతర పత్రికలకు రాసేవాడు. కానీ ఇద్దరం కరీంనగర్‌ జిల్లాకు చెందినవాళ్లం అని తెలియదు. ఒకసారి ఆరు కవితలు రాసి పంపాను. వారు బాగున్నాయని వరుసగా ప్రచురించారు. ప్రభాకర్‌ నాకవితలను, ఆయన కవితలను నేను చదువుతూనే ఉన్నాం. కానీ నేనెవరినో ఆయనకు తెలియదు. కవితల సుడిలోనే ఒరవడిగా కలిశాం. నేను జగిత్యాలలో కొన్ని రోజులు చిన్న ఉద్యోగం చేశాను. అప్పుడు అడ్రస్‌ వెతుక్కుని ఒకరోజు ఆయన్ను కలిశాను. చాలా మాట్లాడుకున్నాం. అప్పటికీ పీఎస్‌ రవీంద్ర అంటే పేరు మాత్రమే తెలుసు కానీ రాసిన కవితలకు అక్షర రూపం నేనేనని తనకు తెలియదు. విషయం తెలియగానే 'వార పత్రికలో వరుసగా కవితలు వస్తున్నాయి. ఎవరో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావచ్చు అని అనుకున్నాను' అని నవ్వాడు. ఇలా మొదలైన మా పరిచయం కొద్దిరోజుల్లోనే మధురమైన స్నేహంగా మారింది.
       అప్పటికే ఆయన జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ ప్రారంభించి ఫొటోలు తీస్తున్నాడు. నాకు కూడా ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇద్దరి మనోభావాలు ఒకే రకంగా ఉండటంతో ఆయన దగ్గరే శిష్యునిగా చేరాను. ఆలోచిస్తూ కవితలు రాసి ఆయన ఎప్పుడో అర్ధరాత్రి దాటిత తర్వాత పడుకునేవాడు. తెల్లవారి పది అయితేగానీ నిద్రలోంచి మెలకువ రాదు.ఉదయం నేనే స్టూడియో తీసేవాడిని. ఆయన కవితలకు మొదటి శ్రోతను నేనే. మంటల జెండాలు అచ్చయిన వెంటనే నాకు చదివి వినిపించాడు. ఈ కవిత్వం ఆయనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. కొంత కాలం అక్కడ పనిచేసి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నాపుట్టిన ఊరు వేములవాడలో స్డూడియో 'ప్రతిమ'ను ప్రారంభించాను.ఈ పేరు పెట్టడం వెనుక కూడా అలిశెట్టి ప్రమే యం ఉంది. ఎందుకంటే ఆయన కరీంనగర్‌లో పెట్టిన స్టూడియోకు 'శిల్పి' అని పేరు పెట్టాడు. నేను ప్రతిమ అని పెట్టుకున్నాను. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న గాడానుబంధాన్ని మరింత దగ్గర చేసింది. కలిసి ఉన్నది కొంతకాలమేనైనా జీవితమంతా మరవని జ్ఞాపకాలను పంచాడు ప్రభాకర్‌.

నువ్విపుడొక విత్తనానివి
రేపు పూసే చిగురుకి సరికొత్త ఊపిరివి.
మరి..మొలకెత్తకముందే అలసిపోయి చచ్చిపోకు.
చచ్చిపోతూ బలవంతంగా మొలకెత్తకు.
లోలోపలే సమాధివయితే
సహించదు మట్టికూడా
వెలుపలకి కుతూహలంగా చొచ్చుకొస్తే
ఆకాశమంత ఎత్తునే చూస్తావు.
- అలిశెట్టి

ప్రేరణ పొందిన అలిశెట్టి కోట్స్‌
- నగరాల్లో అత్యధికంగా అత్యద్భుతంగా
అస్తిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి
- శిల్పం చెక్కకుముందు బండ
శిక్షణ పొందకముందు మొండి
- ఏగ్రూపు రక్తమైనా పీల్చగలవి
దోమలు దోపిడీదారులు
- సలసలా కాగుతున్న ఆకలి సెగల్ని
చల్లార్చలేనివాడు ఆకాశం ఎరుపునీ
అగ్నిపర్వతంలోని లావానీ
ఎలా నిషేధించగలడు
- అద్దంలో నీ అందాన్నే చూసుకుని
మురిసిపోతే అవివేకం.
అద్దంలోంచి అవతలకీ ఇవతలకీ
పారదర్శకంగా చూడగలిగితేనే వివేకం.
- ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవర్నీ వంచించని
ఒకపులి పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథ విని గొర్రెలింకా
పుర్రెలూపుతూనే ఉన్నారు
- నే కష్టపడి రాసుకున్న తీయని వాక్యాన్ని
ఎవర ముక్కలు ముక్కలు చేసి పారిపోయారు.
పదాలన్నీ చిందరవందరగా కిందపడిపోయాయి
అక్షరాలెన్నో చిరిగిపోయాయి.
- ఆకాశమంత ఆకలిలో
అన్నం మొతుకంత చందమా
కంటికీ ఆనందు కడుపూ నింపదు
- సిరాబుడ్లు తాగి కాగితాలు
నమిలితే కవిత్వం పుట్టదు
పెన్నుతో సమాజాన్ని సిజేరియన్‌ చేయాలి.
- ఏ కీలుకు ఆ కీలు విరిచేవాడే వకీలు

మరణం లేని అలిశెట్టి కవిత్వం..
       అతడొక కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చాడు. రెండు దశాబ్దాల కింద మూగబోయిం దతని శరీరం. కానీ కవిత్వం మాత్రం గోడలపై నినా దాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడి కారమై మన మధ్యే తచ్చాడుతున్నది. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా 'కోట్‌' అయిన కవిత్వం ప్రభాకర్‌దే. వర్తమాన కవిత్వానికి 'కాయినేజ్‌' పెంచిన కవీ ఇతనే. రూపంలో సంక్షిప్తతనీ, వస్తువులో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ ఇమిడ్చాడు. సమాజ మార్పుని ఆకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి.'మరణం నాచివరి చరణం' కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించాడు. రోజురోజుకీ అతని కవిత్వానికి ఆదరణ పెరుగుతోంది.
- ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావ్‌

సమాజ స్వాప్నికుడు..
       అక్షరాల భుజాల మీద బందూకులు మోపినవాడు. కాలం అంచుల మీద యుద్ధ గీతాలు రచించినవాడు, రాసినవాడు అలిశెట్టి ప్రభాకర్‌.తెలుగు కవిత్వానికి ఓ ఊపుని, కొత్త రూపునిచ్చి మంటల జెండాలు ఎగరేసి, రక్త రేఖల్ని దాటుకుంటూ, సంక్షోభ గీతాల్ని ఆలపిస్తూ, సిటీలైఫ్‌లో కుమిలి,కుమిలి, కనలి కనలి ఓ స్వాప్నికుడిగా వెళ్లిపోయాడు ప్రభాకర్‌. ఆయన రచనలు గొప్ప ఉద్రేకమైతే, ఆయన వ్యక్తిత్వం ఒక ఉద్వేగం.ఆయన నిరంతరం అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించిన గొప్ప మనిషి.
- వారాల ఆనంద్‌,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

సాహిత్య రంగానికి తీరని లోటు
       అలిశెట్టి ప్రభాకర్‌ నాకు మంచి మిత్రుడు. అతను కవిగా పుట్టాడు. కవిగా బతికాడు. కవిగానే చనిపోయాడు. అతని కవితలు వేమన పద్యాల్లాంటివి. అవి బాణంలా గుండెల్లోకి దూసుకెళ్తాయి. సూటిగా చెప్పడం, బలంగా చెప్పడం ప్రభాకర్‌ నైజం.అవి వచన కవితలైనా ప్రజల నాలుకల మీద ఉండటం విశేషం.కవిగా పుట్టిన వ్యక్తికి మాత్రమే ఇలాంటి కవితలు రాయడం సాధ్యం. చిన్న కవిత అయిన పెద్ద కవిత అయిన అలవోకగా చెప్పే ప్రభాకర్‌ మరికొంత కాలం బతికుంటే తెలుగు సాహి త్యంలో ఇంకా మంచి కవితలు వచ్చేవి. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరనిలోటు.
- డాక్టర్‌ మంగారి రాజేందర్‌జింబో

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.