Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీ భారీగా పెంపు
- భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : స్వదేశీ క్రికెట్ సీజన్, ఐపీఎల్ ద్వారా రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ సొమ్మును క్రికెట్ వ్యవస్థలోకి పంపేందుకు అడుగులు వేస్తోంది. రూ.500 కోట్లతో ఐదు స్టేడియాలను ఆధునీకరించాలని ఇటీవల నిర్ణయించిన బీసీసీఐ.. తాజాగా దేశవాళీ క్రికెట్ టోర్నీల నగదు బహుమతులను భారీగా పెంపుదల చేసింది. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ చాంపియన్ ఈ ఏడాది నుంచి రూ.5 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. రూ. 2 కోట్లుగా ఉన్న ప్రైజ్‌మనీని బోర్డు భారీగా పెంచేసింది. సీనియర్ మహిళల వన్డే టోర్నీ విజేత ఇప్పటివరకు రూ.6 లక్షల నగదు బహుమతి అందుకుంటుండగా.. ఇక నుంచి ఆ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలుగా ఉండనుంది. రంజీ ట్రోఫీ రన్నరప్ రూ.3 కోట్లు, సెమీఫైనలిస్ట్లు రూ.1 కోటి చొప్పున దక్కించుకోనున్నాయి. దులీప్ ట్రోఫీ, విజరు హజారే ట్రోఫీ విజేతలు రూ. 1 కోటి దక్కించుకోనుండగా.. రన్నరప్ జట్లు రూ. 50 లక్షల చొప్పున ఖాతాలో వేసుకోనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నగదు బహుమతి రూ.20 లక్షల నుంచి రూ.80 లక్షలకు పెరుగగా, సీనియర్ మహిళల టీ20 టోర్నీ విజేత నగదు బహుమతి రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంపుదల చేశారు.