Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై ఇరు జట్ల ఫోకస్
- హైదరాబాద్, ముంబయి పోరు నేడు
ఐపీఎల్16లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ ప్రస్థానం ఒకేలా సాగుతోంది!. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు దారుణ పరాజయాలు చవిచూసింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ప్రత్యర్థులపై సాధికారిక విజయాలు నమోదు చేశాయి. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇరు జట్లు గాడిలో పడేందుకు ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్, ముంబయి హ్యాట్రిక్ విజయం ముంగిట నిలువగా.. ముఖాముఖి సమరానికి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబయి ఇండియన్స్ నేడు తలపడనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్
జోరు కొనసాగేనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో కనిపిస్తుంది. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్ సహా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి వచ్చారు. స్పిన్నర్లపై మార్క్రామ్, పేసర్ల బ్రూక్ దంచికొట్టడంతో హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోయాయి!. ఈ ఇద్దరు బ్యాటర్లకు తోడుగా మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్‌లు సైతం చెలరేగితే హైదరాబాద్‌కు తిరుగుండదు. టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్ నిలకడగా నిరాశపరుస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనైనా అతడు పరుగులు రాబడుతాడని సన్‌రైజర్స్ శిబిరం ఆశిస్తోంది. బంతితో మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్‌లు పేస్ బాధ్యతలు పంచుకుంటున్నారు. కానీ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ధారాళంగా పరుగులు ఇవ్వటం ఆందోళన కలిగిస్తోంది. టి. నటరాజన్ నేడు తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. స్పిన్నర్ మయాంక్ మార్కండె, వాషింగ్టన్ సుందర్‌లు ముంబయి మాయ చేసేందుకు ఎదురు చూస్తున్నారు.
తిలక్‌పైనే చూపులు
తెలుగు తేజం తిలక్ వర్మపై నేడు ప్రత్యేక ఫోకస్. హైదరాబాదీ యువ క్రికెటర్ ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో ముంబయికి కీలకంగా మారాడు. సొంత మైదానంలో తిలక్ వర్మ ప్రదర్శనపై ఇక్కడి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరా బాద్‌పై తిలక్ వర్మ స్పెషల్ ఇన్నింగ్స్ నమోదు చేస్తాడేమో చూడాలి. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తెలుగు వాడే కావటంతో.. నేడు తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ జట్టుపై తెలుగు క్రికెటర్లు ధనాధన్ మోతకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు!. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లతో పాటు టిమ్ డెవిడ్, కామెరూన్ గ్రీన్‌లు కీలకం కానున్నారు. ఇక సఫారీ కవల సోదరులు మార్కో జాన్సెన్ (హైదరాబాద్), డ్యుయన్ జాన్సెన్ (ముంబయి) నేడు పేస్ పోరుకు సై అంటున్నారు.