Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టింది. బ్యాటింగ్ పిచ్‌పై, మంచు ప్రభావం అధిగమించి 192 పరుగులను విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 178 పరుగులకు పరుగులకు కుప్పకూల్చి.. 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్16లో ముంబయికి ఇది మూడో విజయం కాగా.. హైదరాబాద్‌కు ఇది మూడో పరాజయం.
- హైదరాబాద్ రోహిత్‌సేన విజయం
- కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ మెరుపుల్
- ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చతికిల
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి. 193 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ చతికిల పడింది.19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (48, 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (36, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిసినా.. హైదరాబాద్ విజయం సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (64 నాటౌట్, 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (38, 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తెలుగు తేజం తిలక్ వర్మ (37, 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు.
ఫ్లాప్ షో : భారీ ఛేదనలో హైదరాబాద్ తడబడింది. మంచు ప్రభావంలోనూ ముంబయి బౌలర్లను ఎదుర్కొలేకపోయింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (6), రాహుల్ త్రిపాఠి (7) సహా అభిషేక్ శర్మ (1), అబ్దుల్ సమద్ (9) విఫలమయ్యారు. పవర్‌ప్లేలో 42/2తో ఒత్తిడిలో పడిన హైదరాబాద్..మయాంక్ అగర్వాల్ (48), కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్ (22), హెన్రిచ్ క్లాసెన్ (36) పోరాడినా ఫలితం లేకపోయింది. మార్కో జాన్సెన్ (13), వాషింగ్టన్ సుందర్ (10)లు ఓటమి అంతరాన్ని కుదించారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లు అదనంగా 19 పరుగులు సమర్పించుకున్నా.. హైదరాబాద్ విజయానికి చేరువ కాలేదు. ముంబయి బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ (1/18), జేసన్ బెహాన్‌డార్ఫ్ (2/37), రిలె మెరెడిత్ (2/33), పియూశ్ చావ్లా (2/43) రాణించారు.
గ్రీన్, తిలక్ షో :ఉప్పల్‌లో బ్యాటింగ్ పిచ్‌పై ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28, 18 బంతుల్లో 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (38) తొలి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. జోరుమీదున్న రోహిత్‌ను నటరాజన్ వెనక్కి పంపించాడు. ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పేసర్ మార్కో జాన్సెన్ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (7)ను అవుట్ చేసి ముంబయి ఇండియన్స్‌ను దెబ్బ కొట్టాడు. కానీ లోకల్ బారు, తెలుగు తేజం తిలక్ వర్మ (37) ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. తిలక్ వర్మ తోడుగా కామెరూన్ గ్రీన్ రెచ్చిపోయాడు. తిలక్ వర్మ నాలుగు సిక్సర్లతో ఉప్పల్ మైదానాన్ని ఊపేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కామెరూన్ గ్రీన్ అర్థ సెంచరీ సాధించగా.. బౌండరీల జోరుమీదున్న తిలక్ వర్మను భువనేశ్వర్ వెనక్కి పంపించాడు. చివర్లో టిమ్ డెవిడ్ (16, 11 బంతుల్లో 2 ఫోర్లు) తోడుగా ముంబయి ఇండియన్స్‌కు కామెరూన్ గ్రీన్ మంచి ముగింపు అందించాడు.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : 192/5 (కామెరూన్ గ్రీన్ 64, ఇషాన్ కిషన్ 38, తిలక్ వర్మ 37, మార్కో జాన్సెన్ 2/43)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 178/10 (మయాంక్ అగర్వాల్ 48, హెన్రిచ్ క్లాసెన్ 36, మెరెడిత్ 2/33, బెహాన్‌డార్ఫ్ 2/37)
సొంతగడ్డపై తిలక్ షో : తెలుగు తేజం, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ఉప్పల్‌లో అదరగొట్టాడు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. తొలిసారి సొంత మైదానంలో ఆతిథ్య జట్టుపై ధనాధన్ మోత మోగించిన తిలక్ వర్మ అభిమానులను అలరించాడు. నాలుగు సిక్సర్లు సంధించిన తిలక్ వర్మ తెలుగు అభిమానులను మెప్పించాడు. మిడిల్ ఓవర్లలో కాస్త నెమ్మదించిన ముంబయి ఇండియన్స్‌ను తిరిగి దూకుడు పట్టాలపైకి ఎక్కించిన తిలక్ వర్మ.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో తిలక్ వర్మ 37 పరుగులు సాధించాడు.
ఉప్పల్ స్టేడియం ఫుల్ : ఇటీవల హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచులకు ప్రేక్షక ఆదరణ గణనీయంగా ఉంటోంది. ఓవైపు అపూర్వ అభిమాన గణం అండ ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల సొంత మైదానాల్లో సైతం అన్ని మ్యాచులకు స్టేడియం పూర్తిగా నిండటం లేదు!. కానీ హైదరాబాద్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచీ రికార్డు స్థాయిలో అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు 38411 మంది అభిమానులు హాజరయ్యారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోనే ఇది అత్యధికం. భారత జట్టు మ్యాచులకు సైతం ఈ స్థాయిలో స్టేడియం ఎన్నడూ నిండలేదు.