Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్, శార్దుల్‌కు చోటు
- సూర్యకుమార్ యాదవ్‌కు మొండిచేయి
- ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ఎంపిక
ముంబయి : 17 నెలలు భారత జట్టుకు దూరమైన అజింక్య రహానె మరోసారి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గద కోసం బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు చారిత్రక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయాన్ని అందించిన నాయకుడిగా అజింక్య రహానె కితాబు అందుకున్నప్పటికీ.. పేలవ ఫామ్‌తో సెలక్టర్లు రహానెపై వేటు వేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడటం, సూర్యకుమార్ యాదవ్ ఆశించిన మేరకు రాణించకపోవటానికి తోడు ఐపీఎల్లో అజింక్య రహానె సరికొత్త సంచలనాలు నమోదు చేయటంతో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అతడిని టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది. ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. జూన్ 7-11న లండన్‌లోని ది ఓవల్ మైదానంలో గద సమరం జరుగనుంది. 'నేను ఎవరికీ ఏదీ నిరూపించుకునేది లేదు. నా పోటీ నాతోనే. దేనికోసమూ పరుగెత్తాలనే ఆలోచన లేదు. నా ఆటపైనే దృష్టి పెట్టాను. మిగతా విషయాలు అన్ని సర్దుకుంటాయని' అజింక్య రహానె అన్నాడు.
ఇక నిలకడగా నిరాశపరుస్తున్న కెఎల్ రాహుల్ సైతం ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది బృందాన్ని సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్‌గా ఎవరి పేరును ప్రకటించలేదు. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, కెఎల్ రాహుల్ ఉన్నారు. ఏకైక వికెట్ కీపర్‌గా తెలుగు తేజం కె.ఎస్ భరత్ ఎంపికయ్యాడు. ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ జట్టులో నిలిచారు. పేస ర్లుగా మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్‌లు చోటు దక్కించుకున్నారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా శస్త్రచికత్స అనంతరం కోలుకుంటున్నాడు. అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
భారత టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, కెఎల్ రాహుల్, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్.