Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ప్రధానమంత్రి
- న్యాయం చేయని ఢిల్లీ పోలీసులు
భారత ఒలింపియన్లు, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి దేశం గర్వపడే ప్రదర్శనలు చేసిన మల్లయోధులు నేడు న్యాయం కోసం రోడ్డెక్కి రోదిస్తున్నారు. మైనర్లు సహా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని జంతర్‌మంతర్ వద్ద అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఏండ్లుగా కఠోరంగా శ్రమించి, ఎన్నో త్యాగాలు చేసి, సవాళ్లను అధిగమించి దేశానికి పతకాలు తీసుకొచ్చే అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురైనా పట్టించుకునే నాథుడే లేడు. సోషల్ మీడియా యుగంలోనూ మల్లయోధుల న్యాయ పోరాటం అరణ్య రోదనగానే ఎందుకు మిగులుతోంది? అసలు రెజ్లర్లు రోడ్డు మీదకు రావడానికి కారణకులు ఎవరు? నిందితులను శిక్షించకుండా రక్షిస్తున్నదెవరు?!
నవతెలంగాణ-న్యూఢిల్లీ
దేశం లేదు, ధర్మం లేదు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అను నిత్యం జపించే మంత్రం దేశం కోసం, ధర్మం కోసం. దేశాన్ని అదాని, అంబానిలకు వదిలేసిన బిజెపి.. ధర్మాన్ని నేరస్థుల చేతుల్లో పెట్టింది!. దేశం తరఫున పతకాలు సాధించిన క్రీడాకారుల పక్షాన నిలబడటమా? పార్టీ లోక్‌సభ ఎంపీ తరఫున నిలబడటమా? అనే అంశంలో బిజెపి నాయకత్వం రెండో ఆలోచన చేయలేదు. తీవ్రమైన లైంగిక ఆరోపణల అంశంలోనూ పార్టీ ఎంపీ పక్షాన నిలబడేందుకు సిద్ధపడింది. క్రీడాకారులను రోడ్డుకు వదిలేసింది. అల్లర్లు, హత్య, హత్యాయత్నం, దోపిడి సహా పలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కోసం.. దేశానికి ప్రాతినిథ్యం వహించే అథ్లెట్లకు భంగపాటు మిగుల్చుతుంది.
గర్వపడే దేశభక్తులు ఎక్కడీ
'యావత్ భారతావని గర్వపడే ప్రదర్శన', ' జాతి గర్వపడేలా చేశారు'... రెజ్లర్లు పతకాలు సాధించగానే సోషల్ మీడియాలో ముంచెత్తే మెసేజ్‌లు ఇవే. అదే దేశం గర్వ పడే ప్రదర్శన చేసిన అథ్లెట్లు నేడు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. మద్దతు పలికేందుకు ఒక్కరూ ముందుకు రావటం లేదు. ఏదైనా దేశం తర్వాతే, దేశభక్తిలో సరిలేరు మాకెవ్వరు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే దేశభక్తులు నేడు రెజ్లర్ల ఆందోళనలో కనిపించటం లేదు. అంతర్జాతీయ వేదికపై మువ్వెన్నల పతాకం రెపరెపలాడే క్షణం కోసం జీవితకాలం శ్రమించే క్రీడాకారులకు బాసటగా నిలిచేందుకు ప్రధాన స్రవంతిలో ఎవరూ ముం దుకు రావటం లేదు.
ప్రధాని మోడికి పట్టదా?!
వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ సహా ఏ క్రీడాకారులైనా పతకాలు సాధించగానే తొలుత వారిని కలుసుకునేది ప్రధాని మోడి. అథ్లెట్లు పతకాలు సాధించటంలో మోడి ఇచ్చిన సలహాలు ఎలా ఉపయోగపడ్డాయో తెలియజేస్తూ వెంటనే వార్తా కథనాలు. మరి అదే అథ్లెట్లు నేడు లైంగిక వేధింపులకు గురై న్యాయ పోరాటం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడికి పట్టదా?!. క్రీడాకారుల విజయాలను రాజకీయంగా వాడుకున్న మోడి నేడు వారు కష్టాల్లో ఉంటే కనీసం ఓదార్చేందుకు కనికరం రావటం లేదా?!. సొంత పార్టీ ఎంపీ మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే మోడి జోక్యం చేసుకోరా?!.
ఎల్లప్పుడూ నిందితుల పక్షమే
రేపిస్టులు, నేర స్థులకు అండగా నిలబడటమే భారతీయ జనతా పార్టీ (బిజెపి) విధానంగా కనిపిస్తుంది. ఉన్నావో అత్యాచార ఘటన నిందితుడు కుల్దీప్ సింగ్, అత్యాచార కేసులో నిందితుడు గుర్మీత్ రామ్ రహీం బాబా, బిల్కిస్ బానొ అత్యాచార నిందితులు.. తాజాగా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వరకు ఏ ఉదంతం తీసుకున్నా బిజెపి నేరస్థులు, నిందితుల పక్షానే నిలబడింది. బాధితుల పక్షాన నిలబడే విధానమే బిజెపి మూల సూత్రాల్లో ఉన్నట్టు కనిపించటం లేదు.
మీడియా.. సెన్సార్
జంతర్ మంతర్ వద్ద నిరసన, రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేధింపుల అంశమే బిజెపికి అధికారికంగా, అనధికారికంగా మద్దతుగా నిలుస్తున్న మీడియాకు కనిపించటం లేదు. రెజ్లర్ల ఆందోళన అంశాన్ని మరుగున పడేయడానికి అధికార పార్టీ అనుకూల టెలివిజన్ చానెళ్లు, సోషల్ మీడియా బృందాలు ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్లో రెజ్లర్ల ఆందోళన వైరల్ కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. వర్తమానంతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను తెరపైకి తీసుకొచ్చి పనికిరాని చర్చ చేస్తున్నాయి. రెజ్లర్లు రోడ్డు మీదకు వచ్చిన మొదటిరోజే జాతీయ మీడియా తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే మల్లయోధులు మరోసారి నిరసనకు దిగే పరిస్థితి వచ్చేది కాదు!. రెజ్లర్ల ఆందోళనపై ఎదురుదాడి వార్తలను చూపిస్తూ.. రెజ్లర్ల రోదనను సెన్సార్ చేస్తున్నాయి.
ఐఓఏ చీఫ్ సైతం..!
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి ఉష తన వ్యాఖ్యలతో స్థాయికి తగ్గించుకున్నారు. రెజ్లర్ల ఆందోళన దేశ ప్రతిష్టకు మచ్చ తీసుకొస్తుందని ఉష అన్నారు. నేడు సాటి మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురైతే ఉష స్పదించిన తీరు విస్తుగొల్పుతుంది. న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్లను హెచ్చరించే స్వరంతో మాట్లాడింది. ఐఏఓ చీఫ్ వ్యాఖ్యలు బిజెపి ఎంపీ సింగ్‌కు మద్దతు ఇచ్చినట్టే భావించాలి.
ఎఫ్ఐఆర్కు నిరాసక్తి
దేశ రా జధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే.. ఢిల్లీ పోలీసు యంత్రాంగం రాహుల్ ఇంటిముందుకొచ్చింది. మహిళల రక్షణపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని నానా రచ్చ చేశారు. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లైంగిక వేధింపులపై ఫిర్యాదు ఇచ్చినా.. అదే ఢిల్లీ పోలీసుల్లో ఎలాంటి చలనం లేదు. లైంగిక ఆరోపణల ఫిర్యాదుపై ఎంపీకి కనీసం నోటీసు సైతం ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రాథమిక విచారణ అవసరమని భావించిన పోలీసులు.. ఇప్పటివరకు ఆ పని కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినా ఉలుకూ పలుకూ లేదు.
ఉష వ్యాఖ్యల దుమారం
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, పరుగుల రాణి పి.టి ఉష వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో దుమారం రేపాయి. ఐఓఏ వర్గాలు సహా క్రీడాశాఖ నియమించిన పర్యవేక్షణ కమిటీ బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు అనుకూలంగా పని చేస్తున్నాయనే రెజ్లింగ్ క్రీడాకారుల అనుమానాలకు బలం చేకూర్చేలా పి.టి ఉష గురువారం మాట్లాడారు. ' రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టడంతో దేశ ప్రతిష్ట దిగజారుతోంది. లైంగిక వేధింపులపై ఐఓఏ అంతర్గత కమిటీ ఉంది. రెజ్లర్లు ఐఓఏ కమిటీ ముందుకు వచ్చి మాట్లాడాలి. రెజ్లర్ల నిరసన తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన' అని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం పి.టి ఉష అన్నారు. ఉష వ్యాఖ్యలపై జంతర్‌మంతర్ వద్ద నిరసనలో ఉన్న మల్లయోధులు మండిపడ్డారు. ' భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు నుంచి ఇటువంటి సమాధానం ఊహించలేదు. ఓ మహిళా అథ్లెట్‌గా మా ఆవేదనను పి.టి ఉష అర్థం చేసుకుంటుందని అనుకున్నాం. అందుకు భిన్నంగా ఆమె మాట్లాడింది. పి.టి ఉష గతంలో ఆమె అకాడమీ కోసం నిరసన చేసిన సంగతి ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాం. మేము మాకు జరిగిన అన్యాయం పట్ల నిరసనగా ఆందోళన చేస్తున్నామని' సాక్షి మాలిక్ మండి పడింది.
అడ్హాక్ కమిటీ ఏర్పాటు
- చైర్మెన్‌గా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి
- సభ్యులుగా భూపేంద్ర సింగ్, సుమ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల పర్యవేక్షణ, ఎన్నికల నిర్వహణకు అడ్హాక్ కమిటీ ఏర్పాటైంది. న్యూఢిల్లీలోని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యాలయంలో సమావేశమైన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ క్రీడాశాఖ సూచన మేరకు అడ్హాక్ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సభ్యుల అడ్హాక్ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. కమిటీ చైర్మెన్ పేరును త్వరలోనే వెల్లడిస్తామని ఐఓఏ అధ్యక్షురాలు పి.టి ఉష తెలిపారు. భారత వుషు సంఘం (డబ్ల్యూఏఐ) అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ బజ్వా.. ఒలింపియన్, జాతీయ కోచ్ సుమ శిరూర్ సభ్యులుగా నియమితుల య్యారు. అడ్హాక్ కమిటీ బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. మే 7న ఎన్నికలకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించిన షెడ్యూల్‌ను కేంద్ర క్రీడాశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
విచారణ సాగుతోంది : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, జాతీయ కోచ్‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ సంఘం విచారణ కొనసాగుతుందని ఐఓఏ సంయుక్త కార్యదర్శి, తాత్కాలిక సీఈవో కళ్యాణ్ చౌబె అన్నారు.