Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగు
- ఛేదనలో క్వింటన్ డికాక్ పోరాటం వృథా
- లక్నో సూపర్‌జెయింట్స్‌పై భారీ విజయం
పాండ్య సోదరుల సమరంలో హార్దిక్ పాండ్య పైచేయి సాధించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ విజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్16 ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. తొలుత గుజరాత్ టైటాన్స్ 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్ 171 పరుగులకే పరిమితమైంది. ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడిన నాలుగు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధించటం విశేషం.
నవతెలంగాణ-అహ్మదాబాద్
గుజరాత్ టైటాన్స్ అడుగు పెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్లే ఆఫ్స్‌లో అధికారికంగా కాలుమోపింది. ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌పై 56 పరుగుల తేడాతో ఎదురులేని విజయం నమోద చేసిన గుజరాత్ టైటాన్స్.. సీజన్లో ఎనిమిదో గెలుపుతో ప్లే ఆఫ్స్‌లో చోటు ఖాయం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్, 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్దిమాన్ సాహా (81, 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు విజృంభించిన వేళ గుజరాత్ టైటాన్స్ తొలుత భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు సాధించింది. భారీ ఛేదనలో లక్నో సూపర్‌జెయింట్స్ చతికిల పడింది. క్వింటన్ డికాక్ (70, 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం దక్కలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లకు లక్నో సూపర్‌జెయింట్స్ 171 పరుగులే చేసింది. 56 పరుగుల భారీ వ్యత్యాసంతో గుజరాత్ టైటాన్స్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. అజేయ అర్థ సెంచరీతో దంచికొట్టిన దంచికొట్టిన శుభ్‌మన్ గిల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. 11 మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఇది ఎనిమిదో విజయం కాగా, 11 మ్యాచుల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది ఐదో పరాజయం. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (16) అగ్రస్థానంలో నిలువగా, లక్నో సూపర్‌జెయింట్స్ (11) మూడో స్థానంలో కొనసాగుతుంది.
ఛేదనలో చతికిల :
లక్నో సూపర్‌జెయింట్స్ లక్ష్యం 228 పరుగులు. ఈ సీజన్లోనే అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఆ జట్టు సొంతం. తొలి పది ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ లక్ష్యం దిశగా సాగింది. కానీ చివరి పది ఓవర్లలో లక్నో ఇన్నింగ్స్ గతి తప్పింది. ఫలితంగా ఆ జట్టు 56 పరుగుల తేడాతో భారీ పరాజయం పాలైంది. ఓపెనర్లు కైల్ మేయర్స్ (48, 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (70, 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు పిండుకుంది. 24 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన మేయర్స్, డికాక్.. టైటాన్స్ బౌలర్లకు సవాల్ విసిరారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 బంతుల్లో క్వింటన్ డికాక్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. అర్థ సెంచరీ ముంగిట కైల్ మేయర్స్ నిష్క్రమణతో లక్నో తడబాటు మొదలైంది. దీపక్ హుడా (11), మార్కస్ స్టోయినిస్ (4), నికోలస్ పూరన్ (3), కెప్టెన్ కృనాల్ పాండ్య (0) ఒత్తిడికి చిత్తయ్యారు. ఆయుశ్ బదాని (21, 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే మిడిల్ ఆర్డర్లో చెప్పుకోదగిన ప్రదర్శన చేశాడు. మేయర్స్ డగౌట్‌కు చేరుకున్నాక.. లక్నో సూపర్‌జెయింట్స్ మానసికంగా ఓటమికి సిద్ధపడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు ఆ జట్టు 171 పరుగులే చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (4/29) నాలుగు వికెట్లతో రాణించాడు. మహ్మద్ షమి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గిల్, సాహా ఉతికేశారు :
టాస్ నెగ్గిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు బ్యాంగ్‌బ్యాంగ్ అందించారు. సీనియర్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా (81, 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్, 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. పవర్‌ప్లేలో వృద్దిమాన్ సాహా లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. సాహా విధ్వంసక విన్యాసంతో తొలి ఆరు ఓవర్లలోనే టైటాన్స్ 78 పరుగులు పిండుకుంది. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 20 బంతుల్లోనే సాహా అర్థ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో గిల్ భిన్నమైన ఆటతీరు కనబరిచాడు. నాలుగు సిక్సర్లతో 29 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సహజంగా బౌండరీలు ఎక్కువగా సాధించే గిల్.. లక్నోపై సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి వికెట్‌కు సాహా, గిల్ జోడీ 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (25, 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (21 నాటౌట్, 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఓ ఎండ్‌లో గిల్ ఏడు సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు సాధించాడు. గిల్ మెరుపులతో గుజరాత్ టైటాన్స్ 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా ప్రయోజనం దక్కలేదు. మోహ్సిన్ ఖాన్, అవేశఖ్ ఖాన్లు చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది వరుసగా నాల్గో పరాజయం.
స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ : వృద్దిమాన్ సాహా (సి) ప్రేరక్ మన్కడ్ (బి) అవేశ్ ఖాన్ 81, శుభ్‌మన్ గిల్ నాటౌట్ 94, హార్దిక్ పాండ్య (సి) కృనాల్ పాండ్య (బి) మోహ్సిన్ ఖాన్ 25, డెవిడ్ మిల్లర్ నాటౌట్ 21, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 227.
వికెట్ల పతనం : 1-142, 2-184.
బౌలింగ్ : మోహ్సిన్ ఖాన్ 3-0-42-1, అవేశ్ ఖాన్ 4-0-34-1, కృనాల్ పాండ్య 4-0-38-0, యశ్ ఠాకూర్ 4-0-48-0, రవి బిష్ణోరు 2-0-21-0, కైల్ మేయర్స్ 1-0-16-0, స్వప్నిల్ సింగ్ 1-0-7-0, మార్కస్ స్టోయినిస్ 1-0-20-0.
లక్నో సూపర్‌జెయింట్స్ : కైల్ మేయర్స్ (సి) రషీద్ ఖాన్ (బి) మోహిత్ శర్మ 48, క్వింటన్ డికాక్ (బి) రషీద్ ఖాన్ 70, దీపక్ హుడా (సి) రాహుల్ తెవాటియ (బి) మహ్మద్ షమి 11, మార్కస్ స్టోయినిస్ (సి) మహ్మద్ షమి (బి) మోహిత్ శర్మ 4, నికోలస్ పూరన్ (సి) మహ్మద్ షమి (బి) నూర్ అహ్మద్ 3, ఆయుశ్ బదాని (సి) నూర్ అహ్మద్ (బి) మోహిత్ శర్మ 21, స్వప్నిల్ సింగ్ నాటౌట్ 2, కృనాల్ పాండ్య (సి) డెవిడ్ మిల్లర్ (బి) మోహిత్ శర్మ 0, రవి బిష్ణోరు నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం :(20 ఓవర్లలో 7 వికెట్లకు) 171.
వికెట్ల పతనం : 1-88, 2-114, 3-130, 4-140, 5-153, 6-166, 7-166.
బౌలింగ్ : మహ్మద్ షమి 4-0-37-1, హార్దిక్ పాండ్య 3-0-37-0, రషీద్ ఖాన్ 4-0-34-1, నూర్ అహ్మద్ 4-0-26-1, మోహిత్ శర్మ 4-0-29-4, అల్జారీ జొసెఫ్ 1-0-5-0.
సోదరుల సమరం
అన్నదమ్ములు కలిసి ఒకే జట్టుకు ఆడటం, ప్రత్యర్థి జట్ల తరఫున ప్రాతినిథ్యం వహించటం ఇప్పటి వరకు మనం చూశాం. ఇర్ఫాన పఠాన్, యూసుఫ్ పఠాన్, మైకల్ హస్సీ, డెవిడ్ హస్సీ, టామ్ కరణ్, శామ్ కరణ్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, అల్బీ మోర్కెల్, మోర్ని మోర్కెల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, బ్రెండన్ మెక్‌కలమ్, నాథన్ మెక్‌కలమ్, డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావో, మార్కో జాన్సెన్, డ్వాన్ జాన్సెన్.. ఇలా ఎందరో అన్నదమ్ములు ఐపీఎల్లో కలిసి, ఒకరితో ఒకరు పోటీపడ్డారు. కానీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి రెండు జట్లకు సోదరులు సారథ్యం వహించి ముఖాముఖి తలపడ్డారు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్య టైటాన్స్‌కు, కృనాల్ పాండ్య సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్సీ వహించారు. ' మా కల నిజమైంది. హార్దిక్, నేను మా జట్లకు సారథ్యం వహిస్తున్నాం. మా కుటుంబానికి ఇది భావోద్వేగ రోజు. మా నాన్న కచ్చితంగా గర్వపడతారు. ఇలా రెండు జట్లకు సోదరులు సారథ్యం వహించటం ఇదే ప్రథమం. మాటలు రావట్లేదు. కానీ మా కుటుంబం గర్వపడుతుంది' అని పాండ్య సోదరులు భావోద్వేగం పంచుకున్నారు.