Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -వనపర్తి
పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ చట్టం ద్వారా నిర్వహించిన పోడు భూముల సర్వేని పూర్తి చేసి, ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం వనపర్తి మండలంలోని పెద్దగూడెం తండా పోడు భూములను, ఆన్లైన్ డేటా నమోదును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూముల క్లెయిమ్‌ల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మండలంలోని సంబంధిత గ్రామాలకు సర్వే బృందాలు వెళ్లి పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆమె అన్నారు. వనపర్తి మండలంలో పెద్దగూడెం తండాలో పోడు రైతుల నుండి 230 దరఖాస్తులు అందాయని, 417.35 గుంటల పోడు భూమిని సర్వే చేసినట్లు, ఇందులో 113 దరఖాస్తులు పరిశీలించి నట్లు ఆమె తెలిపారు. వనపర్తి మండలంలో మొత్తం 1,897 దరఖాస్తులు స్వీకరించామని, 3,558.18 గుంటల భూమి సర్వే పూర్తి చేసినట్లు, 89.46 శాతం పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.ప్రతిరోజు మండలాల వారీగా దరఖాస్తులను పరిశీలించాలని, పూర్తి చేసిన పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. మండల ప్రత్యేక అధికారులు పనులు పర్యవేక్షిస్తూ ఆన్ లైన్ నమోదు వేగవంతం చేయాలని ఆమె అన్నారు. సాగుచేస్తున్న ఏ వ్యక్తి నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి అధికారి రామకష్ణ, ట్రైబల్ అధికారి శ్రీనివాస్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.